పునరావాస పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలలో పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి దాదాపు మూడు గంటల పాటు పోలేపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను పరిశీలించారు. దేవునిగుట్ట తండా వద్ద ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలు 1, 2లలో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ నిర్వాసిత గ్రామాలతో పాటు చిన్నగుట్టతండా, తుమ్మలకుంట తండా, ఒంటిగుడిసె తండా, రేగడిపట్టి తండావాసులకు సంబంధించి చేపట్టిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. పునరావాస కేంద్రం–1లో రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి 151 ప్లాట్లలో చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, డ్రెయినేజీ, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలు చేపట్టనున్న స్థలాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ పనులపై దృష్టి సారించి నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతివారం పునరావాస కేంద్రాల పనుల పురోగతిని తమ కార్యాలయంలో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇక నుంచి పనుల జాప్యాన్ని సహించబోమన్నారు. వేసవి కాలం పూర్తయ్యేలోగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ నవీన్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ చక్రధరం, ఈఈలు రమేశ్, ఉదయ్‌కుమార్, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్‌రావు, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, మౌలిక విద్య సదుపాయాల సంస్థ ఈఈ రాంచందర్, స్థానిక తహసీల్దార్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.


