దేవరగుట్టలోనే చిరుతల మకాం
నవాబుపేట: మండలంలోని యన్మన్‌గండ్ల దేవరగుట్టలో రెండు చిరుతలు వారం రోజులుగా మకాం వేశాయి. గుట్టలోని గుహలను ఆవాసంగా మార్చుకున్నాయి. బుధవారం రెండు చిరుతలు ఒకదాని తర్వాత మరొకటి బయట తిరిగి.. మళ్లీ గుహలోకి వెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చాలా వరకు చిరుతలు తమ స్థావరాన్ని మారుస్తూ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం రెండు చిరుతలు దేవరగుట్టను వదలడం లేదు. ఇందుకు అనారోగ్యం కారణమై ఉండవచ్చని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్ అనుమానం వ్యక్తంచేశారు. గుట్ట పరిసరాల్లో పశువులను ఉంచరాదని.. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేవరగుట్ట పరిసరాల్లోని కుక్కలను చిరుతలు హతమార్చి ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.


