భూభారతిపై అవగాహనతో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భూభారతిపై అవగాహనతో ఉండాలి

Apr 17 2025 12:52 AM | Updated on Apr 17 2025 12:52 AM

భూభారతిపై అవగాహనతో ఉండాలి

భూభారతిపై అవగాహనతో ఉండాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి–2025 చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో ‘భూభారతి’ భూమి హక్కుల రికార్డు–2025 చట్టంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు–2025 చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టంలోని అన్ని నియమాలను చదివి తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే అవగాహన కార్యక్రమంలోనే అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. న్యాయసేవ సంస్థలు, ఇతర సంస్థ లు, వ్యవస్థల ద్వారా పేదలకు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల వారికి, మహిళలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఈ చట్టం ద్వారా అందించాలన్నారు. ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కారమార్గం చూపించనుందని తెలిపారు. తహసీల్దారు చేసిన మ్యుటేషన్లు, జారీ చేసిన పాస్‌ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ లేదా కలెక్టర్‌కు అప్పీలు చేసుకునేలా రెండు అంచెల అప్పీలు వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. వారసత్వంగా సంక్రమించే భూముల మ్యుటేషన్ల విష యంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. భూభారతి చట్టం–2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్‌ ఐడీ భూదార్‌ ఇవ్వడం గురించి వివరించారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, ఆర్‌డీఓ నవీన్‌, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్‌, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీసీఓ శంకరాచారి, డీఆర్‌డీఓ నర్సింహులు పాల్గొన్నారు.

నేటి నుంచిఅవగాహన సదస్సులు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): భూభారతి చట్టంపై గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు జిల్లాలో మండలాల రోజువారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయేందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17న జడ్చర్లలో, 19న గండేడ్‌లో మండలంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మహమ్మదాబాద్‌ మండలంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 21న అడ్డాకల్‌ మండలంలో ఉదయం, మూసాపేట మండలంలో మధ్యాహ్నం, 22న మిడ్జిల్‌, భూత్పూర్‌, 23న చిన్నచింతకుంట, కౌకుంట్ల, 24న కోయిలకొండ, హన్వాడ, 25న దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ రూరల్‌, 26న మహబూబ్‌నగర్‌ అర్బన్‌, 28న నవాబుపేట, 29న బాలానగర్‌, రాజాపూర్‌లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సదస్సులో ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement