బీసీలంతా సంఘటితం కావాలి
నవాబుపేట: బీసీలంతా సంఘటితమై దోపిడీ వర్గాల రాజ్యాలను కూలదోసి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు అజయ్‌కుమార్ యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయ ఆవరణలో బీసీ జనచైతన్య సదస్సు వేదిక జిల్లా నాయకుడు మాధవులు అధ్యక్షతన జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దోపిడీ రాజ్యం నడుస్తోందన్నారు. ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌కు తాజాగా బీసీల గణన గుర్తుకురావటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అది నాయకత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని బీజేపీ సైతం అధిక జనాభా కలిగిన బీసీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీసీలంతా పార్టీలు వీడి సమష్టిగా ఉన్నప్పుడే బలం తెలిసి రాజ్యాధికారం వస్తుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బోయిని మహేష్, జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మాజీ సర్పంచ్‌లు యాదయ్య, ఆంజనేయులు, మాసయ్య, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్‌నాయీ, జిల్లా నాయకులు అంజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


