మెనూ పాటించడం లేదని హాస్టల్ విద్యార్థుల నిరసన
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల హాస్టల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే కామన్ మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసన తెలిపారు. గురువారం రాత్రి భోజన సమయంలో భోజనానికి ముందు మెనూ గురించి అడిగితే ఔట్‌సోర్సింగ్ కుక్ శ్రీశైలం పొంతలేని సమాధానాలు చెప్పారని ఆరోపించారు. భోజనాలు చేయకుండా హాస్టల్‌లో ఉండే విద్యార్థులు అంతా కలిసి పట్టణంలోని పాలమూరు రోడ్డుపైకి వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ వార్డెన్ ఖలీల్ విద్యార్థులకు నచ్చజెప్పి హాస్టల్‌కు తీసుకొచ్చారు. హాస్టల్ లోపలికి వచ్చిన విద్యార్థులు భోజనం చేయమని వారించి రాత్రి 10 గంటల దాకా హాస్టల్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. చివరికి హాస్టల్ వార్డెన్ వారికి నచ్చజెప్పి, కుక్‌ను తొలగిస్తామని, మెనూ ప్రకారం భోజనం ఉండేలా చూసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి అందేలా చూస్తానని చెప్పడంతో విద్యార్థులు నిరసన విరమించి.. భోజనాలు చేశారు.


