ప్రమాదకర ప్రదేశం మినహాయించి.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకర ప్రదేశం మినహాయించి..

Apr 18 2025 12:48 AM | Updated on Apr 18 2025 12:48 AM

ప్రమాదకర ప్రదేశం మినహాయించి..

ప్రమాదకర ప్రదేశం మినహాయించి..

అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో శిథిలాల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. సహాయక బృందాలు 55 రోజులుగా నిరంతరాయంగా తవ్వకాలు చేపడుతున్నా ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు. గురువారం మూడు షిఫ్ట్‌లలో సొరంగంలోకి వెళ్లి పేరుకుపోయిన మట్టి, బురద తవ్వకాలు చేపడుతున్నారు. డీ2 ప్రదేశంలో 5 ఎస్కవేటర్లతో పెద్ద పెద్ద బండరాళ్లు తొలగిస్తూ అత్యధికంగా ఉన్న మట్టిని కన్వేయర్‌ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. నిషేధిత ప్రదేశం 50 మీటర్లు మినహాయిస్తే.. డీ2–డీ1 మధ్య మరో 20 మీటర్ల పొడువు మూడు అడుగుల మేర ఉన్న మట్టి, బురద, శిథిలాల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. మరో రెండ్రోజుల్లో ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. సొరంగం పైకప్పు కూలిన 13.940 కిలోమీటరు డీ1 ప్రదేశంలో 40 మీటర్ల వరకు డేంజర్‌ జోన్‌గా గుర్తించి కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో బలహీనంగా ఉన్న కాంక్రీట్‌ సెగ్మెంట్లకు సపోర్టుగా సింగరేణి మైన్స్‌ రెస్క్యూ సిబ్బంది టైగర్‌ క్లాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ శిథిలాలు నిండుగా ఉన్నాయి. అత్యంత ప్రమాదకర ప్రదేశం మినహాయించి తవ్వకాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న 20 మీటర్ల తవ్వకాల్లో కార్మికుల ఆచూకీ లభించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీబీఎం కొంత భాగం నిషేధిత ప్రదేశంలో చిక్కుకుపోయి ఉండటంతో కార్మికులు అందులో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, జీఎస్‌ఐ తదితర జాతీయ సహాయక బృందాలతో పాటు ప్రభుత్వ విభాగాలతో ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధిత ప్రదేశంలో కార్మికులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగించాలా? సహాయక సిబ్బందికి ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ముందకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

డీ–2 ప్రదేశంలో మట్టి తవ్వకాలు..

సొరంగంలోని ప్రమాద డీ2 ప్రదేశంలో సహాయ సిబ్బంది మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ప్రత్యేక అధికారి శివశంకర్‌ లోతేటి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్‌ వద్ద గురువారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల అచూకీ కనుక్కొనేందుకు డీ1, డీ2 ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుందన్నారు. డీ2 ప్రదేశంలో మట్టి తవ్వకాలు చేపడుతూ టీబీఎం కత్తిరింపు పనులు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరంగా వస్తున్న నీటి ఊటను బయటకు పంపిస్తున్నామని, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేశామన్నారు. సొరంగం నిపుణులు ప్రమాద ప్రదేశాన్ని నిరంతరం పరిశీలిస్తూ సహాయక సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్‌, విజయ్‌కుమార్‌, జేపీ కంపెనీ సీనియర్‌ ప్రాజెక్టు ఇంజినీర్‌ సంజయ్‌కుమార్‌సింగ్‌, సింగరేణి మైన్స్‌ రెస్క్యూ జనరల్‌ మేనేజర్‌ బైద్య, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తయ్యే అవకాశం

నిషేధిత ప్రదేశంలో

రెస్క్యూ కొనసాగేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement