ఫుట్‌బాల్ క్రీడాకారుల సైకిల్ యాత్ర
గద్వాలటౌన్: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటు కోరుతూ మూడేళ్ల కిందట గద్వాల క్రీడాకారులు జిల్లాకేంద్రం నుంచి మంత్రాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. గతేడాది జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటు కావడంతో మంత్రాలయం రాఘవేంద్రస్వామికి మొక్కు చెల్లించడంలో భాగంగా శుక్రవారం సీనియర్ క్రీడాకారుడు, ఇంటిలిజెన్స్ సీఐ నర్సింహారాజు ఆధ్వర్యంలో 30 మంది క్రీడాకారులు ప్రత్యేక డ్రస్ కోడ్‌లో స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. శుక్రవారం స్వామివారికి మొక్క చెల్లించి శనివారం గద్వాలకు చేరుకుంటారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్, విజిలెన్స్ సీఐ విజయసింహ, మాజీ కౌన్సిలర్ బండల పాండు, సీనియర్ క్రీడాకారులు జగన్, ఇండికా శివ, జయసింహ, ప్రశాంత్, స్వామి, హరిశంకర్‌గౌడ్, విజయ్, బండల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


