రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
ఆత్మకూర్: రైలుకు ఎదురుగా వెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల నడుమ చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి అశోక్, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గద్వాలలోని హౌజింగ్‌బోర్డుకాలనీకి చెందిన ఏకే బాలరాజు (30) కొంతకాలంగా తాగుడుకు బానిసకావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తండ్రి నాగేశ్వర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు వైద్యం చేసుకోవాలని కోరగా బాలరాజు నిరాకరించి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లి అర్ధరాత్రి సమయంలో గద్వాల, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల నడమ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతదేహాన్ని గద్వాల మార్చురికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
కాంట్రాక్ట్ అధ్యాపకుడి దుర్మరణం
పెద్దకొత్తపల్లి: కారు, బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని చంద్రకల్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని గన్యాగులకు చెందిన బాలరాజు (27), మల్లేష్ గ్రామం నుంచి మండల కేంద్రానికి వస్తుండగా కొల్లాపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలరాజు అక్కడికక్కడే మృతిచెండగా.. మల్లేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట అధ్యాపకుడి పని చేస్తున్నారు.
కారు ఢీకొని వ్యక్తి..
కొత్తకోట: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెబ్బేరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి కథనం మేరకు.. పెబ్బేరుకు చెందిన చెటమోని ఎల్లస్వామి (37) పొలం పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై పెబ్బేరుకు బయలుదేరాడు. రంగాపూర్ జాతీయ రహదారిపై బైపాస్ వద్దకు చేరుకోగానే హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఎల్లస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బస్సు, బైక్ ఢీకొని మరొకరు ..
కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్ గ్రామపంచాయతీ టైరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం, బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎండీ నవీద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ప్రెగడబండకు చెందిన కుర్వ అంజప్ప (28) తన ద్విచక్ర వాహనంపై కర్ణాటకలోని కొర్తికొందకు బయలుదేరాడు. టైరోడ్డుకు చేరుకోగానే హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. వెంటనే చుట్టుపక్కల వారు అంబులెన్స్‌లో రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అంజప్పకు భార్య శంక్రమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.


