జూరాల కాల్వలకు నిలిచిన నీటి సరఫరా
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని శుక్రవారం సాయంత్రం నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని గత వారమే నిలిపివేయగా.. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి నీటిని వదలాలని రైతులు ఆందోళనలు చేయడంతో రెండు రోజులపాటు నీటిని విడుదల చేశారు. అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, మరో రెండు తడులు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నా.. ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం అడుగంటిపోతుండటంతో కేవలం ఒకే తడి ఇస్తున్నట్లు ప్రకటించి నీటిని విడుదల చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం శుక్రవారం కాల్వకు సాగునీటిని నిలిపివేశామని డీఈ నారాయణ, ఏఈ ఆంజనేయులు తెలిపారు.
పురాతన విగ్రహాల
సంరక్షణ ఏది?
పెంట్లవెల్లి: మండలంలోని మల్లేశ్వరం గ్రామంలో పుష్కరఘాట్ దగ్గర బండపై పురాతన పద్మనాభుడు, వీరభద్రుడి విగ్రహాలు ఏళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. కృష్ణానదిలో మునిగిన సమయంలో వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారే తప్ప నేటికి ఆలయం నిర్మించి పూజలు చేయడం లేదు. ఈ విషయాన్ని పలుమార్లు దేవాదాయశాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా స్పందించి సంరక్షించాలని కోరుతున్నారు.
ఊర్కొండపేట అత్యాచార ఘటన సీన్ రీ కన్‌స్ట్రక్షన్
ఊర్కొండ: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై దుండగులు అత్యాచారం చేసిన సంఘటన విదితమే. దీనికి సంబంధించి నిందితులను కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం సంఘటన స్థలానికి తీసుకువచ్చారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో మారుపాకుల ఆంజనేయులు, సాధిక్ బాబా ముందుగా ఆ తర్వాత మణికంఠ, కార్తీక్‌లను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. నేరం జరిగిన తీరుపై నిందితుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచార ఘటన తర్వాత ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంలో పోలీసులు గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలో మూడు బైకులు, సంఘటన రోజు నిందితులు ధరించిన దుస్తులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సంఘటన స్థలంతో పాటు నిందితుల గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూరాల కాల్వలకు నిలిచిన నీటి సరఫరా


