లభించని ఆరుగురి ఆచూకీ
అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి శనివారంతో 57 రోజులకు చేరింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ వంటి 12 విభాగాలకు చెందిన సిబ్బంది విడతల వారీగా 24గంటల పాటు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఐదు ఎస్కవేటర్ల సాయంతో మట్టి తొలగిస్తున్నప్పటికీ ఆరుగురి కార్మికుల ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. డీ–2 నుంచి డీ–1 ప్రదేశంలో మట్టి, బురద, రాళ్లు తొలగించినా కార్మికుల జాడ లభించక పోవడంతో.. కంచె ఏర్పాటు చేసిన నిషేధిత ప్రదేశం 40 మీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 20వ తేదీలోగా శిథిలాల తొలగింపు పూర్తి చేయాల్సి ఉండటంతో సహాయక సిబ్బంది రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. యంత్రాలతో ఎక్కువగా పనులు చేస్తుండటంతో సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్నారు.
ప్రమాద ప్రదేశం పరిశీలన..
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టి తొలగింపు సాధ్యాసాధ్యాలను సహాయక బృందాల ఉన్నతాధికారులు మరోసారి పరిశీలించారు. అయితే ఇప్పట్లో డేంజర్ జోన్ ప్రదేశంలో తవ్వకాలు జరిపే వీలు కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బృందాలు సహాయక చర్యలను నిలిపివేసి వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉంది. కాగా, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు ఎస్కవేటర్ల సాయంతో మట్టి, బురదతీత పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. డేంజర్ జోన్ సమీపంలో మట్టి తరలింపునకు అడ్డుగా వస్తున్న బండ రాళ్లను విచ్చిన్నం చేసి లోకో ట్రేన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. సిబ్బందికి అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నామని.. తాగునీరు, ఆహార పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలకు పంపిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో 57 రోజులకు
చేరిన సహాయక చర్యలు


