నారాయణపేట రూరల్: రోజురోజుకు ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో మనుషులతో పాటు వాహనాలు సైతం తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ హిటాచీ వాహనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుండుమల్ మండల కేంద్రం నుంచి నారాయణపేట మండలం కోటకొండ వరకు డబుల్రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హిటాచీ వాహనంతో బండగొండ సమీపంలో రోడ్డును తవ్వుతుండగా.. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు వాహనంలోని బ్యాటరీలు, ఆయిల్ విపరీతమైన వేడికి గురయ్యాయి. దీంతో వాహనంలో నుంచి పొగలు రావడంతో భయపడి అప్రమత్తమైన ఆపరేటర్ ఆంజనేయులు వెంటనే వాహనం నుంచి దిగి దూరంగా పరిగెత్తాడు. అంతలోనే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఫైరింజన్ అక్కడికి చేరుకున్నా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో సుమారు రూ. 20లక్షలనష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.


