సోషల్ మీడియా, ఏఐపై అప్రమత్తంగా ఉండాలి
కొల్లాపూర్: సంప్రదాయ మీడియా భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారిన సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై త్వరలోనే హైదరాబాద్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం కొల్లాపూర్ మండలం సోమశిలలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ వల్ల భవిష్యత్‌లో మీడియా రంగంలో మానవ శక్తి అవసరం లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్పిత వార్తలు, కథనాలు, సమాచారాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం పొంచి ఉందన్నారు. దీనిపై జర్నలిస్టులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన అక్రిడిటేషన్ జీఓ అప్రజాస్వామికంగా ఉందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కొత్త అక్రిడిటేషన్ జారీ ఆలస్యమవుతోందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు అవుతాయని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు
ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల పక్షపాతిగా, జర్నలిస్టుల సంక్షేమం కోసం 65 ఏళ్లుగా పోరాడుతున్న చరిత్ర ఐజేయూదని స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్ అన్నారు. ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సంఘ నాయకులకు ప్రభుత్వ పదవులు వచ్చినంత మాత్రాన, సంఘ ప్రయోజనాలు, పదవుల బాధ్యతలు వేరుగా ఉంటాయని వివరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, ఉచిత విద్య అంశాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, నగునూరి శేఖర్, కె.రాములు, బుర్ర సంపత్‌కుమార్ గౌడ్, గాడిపల్లి మధుగౌడ్, ఫైజల్ అహ్మద్, మధుగౌడ్, యాదగిరి, శ్రీకాంత్‌రెడ్డి, మోతే వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మీడియా
అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి


