రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎం దుర్మరణం
వెల్దండ/తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎం మృతిచెందిన ఘటన వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అచ్చంపేటకు చెందిన పాపిశెట్టి శ్రీనివాసులు (61) తెలకపల్లి పాఠశాలలో జీహెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పిల్లల చదువు నిమిత్తం కొంతకాలంగా ఆయన భార్య కమల తమ కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లోని మన్నెగూడలో నివాసం ఉంటున్నారు. పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు శ్రీనివాసులు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన.. సోమవారం కారులో తెలకపల్లి పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యంలోని పెద్దాపూర్ సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, జీహెచ్‌ఎం పాపిశెట్టి శ్రీనివాసులు ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 17న తెలకపల్లి పాఠశాలలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎం మృతితో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
మల్దకల్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మండలంలోని ఎల్కూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఎల్కూరు గ్రామానికి చెందిన వెంకటేష్ (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఈ నెల 17 రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేష్‌ను చికిత్స నిమిత్తం గద్వాల, అక్కడి నుంచి కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పురేందర్ తెలిపారు.
రంపంతో భర్త గొంతు కోసిన భార్య
లింగాల: నిద్రలో ఉన్న భర్త గుండూర్ కురుమయ్య గొంతుపై భార్య చెన్నమ్మ రంపం బ్లేడ్‌తో గాయపర్చిన ఘటన సోమవారం మండలంలోని అవుసలికుంటలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ వెంకటేష్‌గౌడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19న భార్య చెన్నమ్మతో కుర్మయ్య గొడవపడ్డారు. అదే రోజు రాత్రి 11 గంటలకు చెన్నమ్మ రంపం బ్లేడ్‌తో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న భర్తపై కుర్మయ్య గొంతు కోసింది. కుర్మయ్య అరుపులు విని పక్క ఇంటిలో ఉన్న అన్న వెంకటయ్య, ఆయన భార్య లక్ష్మి వెళ్లి చెన్నమ్మను పక్కకు తోసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వెంటనే బాధితుడిని 108 అంబులెన్సులో లింగాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి బలవన్మరణం
గోపాల్‌పేట: కుటుబ కలహాలు తట్టుకోలేక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని బండపల్లి కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గోపాల్‌పేటకు చెందిన గిరమ్మ, గోపాల్ దంపతుల పెద్దకుమారుడు మండ్ల రాములు(35)కు 15ఏళ్ల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన లావణ్యతో పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో లావణ్య వారి పుట్టింటి వద్దే ఉంటోంది. రాములు అప్పుడప్పుడు భార్య వద్దకు వెళ్లి వస్తుండేవాడు. గొడవల వల్ల జీవితంపై విరక్తి చెందిన రాములు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మరణించాడని మృతుడి తల్లి గిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎం దుర్మరణం


