అడ్డాకుల: భూభారతి చట్టం ద్వారా భూమికి సురక్షిత హక్కులు కల్పిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. అడ్డాకుల, మూసాపేటలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటుతో కలెక్టర్ స్థాయిలోనే భూముల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని చెప్పారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూ సమస్యలపై కోర్టుల చుట్టూ తిరగకుండా భూభారతి చట్టం మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీఎమ్మార్ మాట్లాడుతూ గ్రామస్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు తిరిగినా ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని..అందుకే భూ భారతి చట్టాన్ని తెచ్చి రైతుల బాధను తీరుస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు భూమిపై హక్కులు కల్పిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ కోసమే ధరణిని తెచ్చి రైతులకు కన్నీరు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తెచ్చి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా.. అడ్డాకులలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. కూచిపూడి డ్యాన్స్‌లో గిన్నిస్‌రికార్డు సాధించిన మూసాపేటకి చెందిన నామాల ఎల్లస్వామి కుమార్తె శ్రీఆధ్యను అభినందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, ప్రత్యేకాధికారి శంకరాచారి, తహసీల్దార్లు శేఖర్, రాజునాయక్ పాల్గొన్నారు.


