వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో భూగర్భజలాలు పెంచేందుకు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నీటివాడకం నియంత్రణ, సంరక్షణపై జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలననుసరించి నీటి వాడకం, సంరక్షణపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న గృహాల్లో వర్షం నీటి సంరక్షణ, ఇంకుడుగుంతల నిర్మాణాలపై సర్వే చేసి డేటా తయారు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించే గృహాలకు అనుమతి మంజూరు చేసినప్పుడు పంచాయతీ, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా వర్షపు నీరు సంరక్షించే ఇంకుడుగుంతల నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త బోర్లు వేసేప్పుడు సంబంధిత అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, బోర్లు తవ్వినప్పుడు వాల్టా చట్టం నిబంధనలు అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్‌లో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ, ఇరిగేషన్, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖలు, భూగర్భజలాల శాఖలు కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థలు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్‌డీఓ నరసింహులు, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, డీపీఓ పార్థసారథి, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ, భూగర్భ జలాల శాఖ అధికారులు పాల్గొన్నారు.


