సన్న బువ్వ.. సంబురం
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈనెల 1 నుంచి చౌకధర దుకాణాల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించగా, కార్డుదారులు దుకాణాల వద్ద బారులు తీరి బియ్యం తీసుకున్నారు. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో చాలామంది లబ్ధిదారులు అదే రేషన్ దుకాణంలో కిలో రూ.10లకు చొప్పున విక్రయించి.. డబ్బులు తీసుకునేవారు. కానీ ఈ నెలలో తొలి వారంలోనే 80 శాతం మంది బియ్యం తీసుకెళ్లడం గమనార్హం. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 185 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఎక్కువగా జరిగింది.
● చౌకధర దుకాణాల ద్వారా ప్రతినెలా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో కొందరు ఆ బియ్యం తినలేక దళారులకే విక్రయించేవారు. కార్యక్రమ ఉద్దేశం నెరవేరడం లేదని భావించిన ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. గతంలో తరచూ దొడ్డు బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఘటనలు చోటు చేసుకునేవి. ఈసారి అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అధికార వర్గాల్లోనూ కార్యక్రమ అమలు విజయవంతమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పట్టణ, పల్లె తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ఎదుట బారులు తీరి మరీ బియ్యం తీసుకెళ్లారు. 20 రోజుల్లో 88.04 శాతం బియ్యం పంపిణీ పూర్తవడం గమనార్హం.
అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు
మొదటి కోటా కింద చౌకధర దుకాణాలకు పంపిణీ చేసిన సన్న బియ్యం నాణ్యత మెరుగ్గా ఉందని లబ్ధిదారులు తెలిపారు. కానీ రెండో కోటా కింద నాణ్యత అంత బాగాలేదన్నారు. మొదటి దఫాలో సన్నరకంతో పాటు నూక తక్కువ ఉందని, రెండో దఫాలు మధ్యస్థ రకంతో పాటు నూక ఎక్కువ ఉందని పేర్కొన్నారు. నాణ్యమైనవి పంపిణీ చేయాలని కోరుతున్నారు. మెజారిటీ లబ్ధిదారులు సన్న బువ్వపై సంతృప్తి వ్యక్తం చేయగా.. కొంతమంది మాత్రం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా, చల్లారితే గట్టిగా అవుతుందని పేర్కొంటున్నారు.
కార్డు ఉంటే ఎక్కడైనా బియ్యం
ప్రస్తుతం సన్న బియ్యం ఇస్తుండటంతో రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ బియ్యం తీసుకుంటున్నారు. పైగా పోర్టబిలిటీ సదుపాయం అందుబాటులో ఉండటంతో కార్డుదారులకు తమకు అందుబాటులో ఉన్న చౌకధర దుకాణం వద్దకు వెళ్లి మరీ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ తీసుకునేలా గతంలోనే చర్యలు చేపట్టినా, దొడ్డు బియ్యం పెద్దగా తీసుకునే వారు కాదు. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో కార్డుదారులు ముందుగానే వచ్చి తీసుకెళ్తున్నట్లు రేషన్‌డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో ఇకపై చౌకధర దుకాణాల్లో బియ్యం మిగిలే అవకాశాలు లేదు. గతంలో దొడ్డు బియ్యం కావడంతో కొంతమేర డీలర్ల వద్ద మిగిలి ఉండేది. మరుసటి నెలలో దానిని సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
బియ్యం బాగున్నాయి
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బాగున్నాయి. అందులో ఎలాంటి నూకలు, తవుడు కూడా లేదు. మార్కెట్‌లో వేలాది రూపాయలు వెచ్చించి బియ్యం కొనుగోలు చేయలేని మా లాంటి వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ బియ్యంతో వండిన బువ్వ కూడా రుచికరంగా ఉంది. – ఎంగగళ్ల నాగరాజు,
పాతపాలమూరు, మహబూబ్‌నగర్
నూకలు వస్తున్నాయి..
మా కుటుంబానికి 30 కిలోల సన్న బియ్యం ఇచ్చిండ్రు. అందులో 5 కిలోల నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతినెలా సన్న బియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది.
– మద్దెల నాగమణి, గృహిణి, రామచంద్రాపూర్
ప్రజల్లో సంతృప్తి..
జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన కోటా బియ్యం వందశాతం చౌకధరల దుకాణాలకు చేరాయి. గతంలో బియ్యం పంపిణీ ప్రారంభించిన పదిరోజుల్లో సగం బియ్యం కూడా కార్డుదారులు తీసుకెళ్లేవారు కాదు. ప్రస్తుతం 4,290 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. ప్రతి కార్డుదారు బియ్యంను తీసుకెళ్తున్నారు. వాటిని వండుకుని తింటున్నారు. మేము ప్రత్యక్షంగా కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలించగా బువ్వ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– అశోక్ సోఫీ, ఇన్‌చార్జి డీఎస్‌ఓ
సన్నబియ్యం పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఆర్థిక భారం తప్పిందంటున్న జనం
గత నెల కంటే 185 మెట్రిక్ టన్నుల ఎక్కువ బియ్యం పంపిణీ
సన్న బువ్వ.. సంబురం
సన్న బువ్వ.. సంబురం


