మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అన్ని శాఖలు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. కలెక్టర్ విజయేందిర, ఎస్పీ డి.జానకి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి డి.ఇందిరలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి పాపిరెడ్డి మాట్లాడుతూ జిల్లాను మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి రహిత జిల్లాగా రూపొందించాలన్నారు. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి నేరం అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. చిన్నపిల్లలు, మహిళల మానవ అక్రమ రవాణా గుర్తించేందుకు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్య వచ్చినట్లయితే ఏ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన విషయాలపై శిక్షణలో తెలుసుకోవాలని సూచించారు. సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న చట్టాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే విధంగా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మానవ అక్రమ రవాణా విషయంలో ముంబై, ఢిల్లీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జిల్లాలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖ వారికి అన్ని శాఖల సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ చిన్నపిల్లలు, మహిళలను మానవ అక్రమ రవాణా చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మానవులను ఒక ఆట వస్తువుగా లైంగిక హింసకు గురి యడం, పని మనుషులుగా పని చేయడం కోసం తదితర కారణాల వలన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు దేశాలకు రవాణా చేయడం జరుగుతుందన్నారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కార్మికులు వలసలుగా వచ్చి పని చేస్తున్నారని, వీరికి సరైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించక మానవ హక్కులు కాలరాస్తున్నట్లు తెలిపారు. మానవ అక్రమ రవాణా, బాలకార్మికుల వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రభుత్వం చట్టాలు రూపొందించినట్లు తెలిపారు. చైల్డ్ ప్రొటెక్షన్, పోలీసు, కార్మిక, విద్యా, వైద్య, ఆరోగ్యశాఖలు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించి వారికి కావాల్సిన సహాయం అందించాలన్నారు. ఎస్‌పీ జానకి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ఎక్కువ శాతం జరుగుతుందన్నారు. చిన్నపిల్లలు ఎక్కడ తప్పిపోయినా బస్‌స్టేషన్ లేదా రైల్వేస్టేషన్‌లో వాళ్లు ఎక్కడో ఒకచోట ట్రేస్ అవుతున్నారని, కానీ టీనేజ్ పిల్లలు కనిపించకపోతే ట్రేస్ చేయడం చాలా కష్టమన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులకు తమ వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎన్.చంద్రశేఖర్ గౌడ్, జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కష్ణ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఎన్జీఓ) జోబి ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి


