
రైతు సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తిస్వామి ఆలయ జాతర మైదానంలో నిర్వహించే రైతు అవగాహన సదస్సు సభకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అన్నారు. కురుమూర్తిస్వామి ఆలయ జాతర మైదానంలో బుధవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే భూ భారతి చట్టం రైతు అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ సభాస్థలాన్ని పరిశీలించి.. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండేలా చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగానే ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుందన్నారు. సదస్సుకు చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, కురుమూర్తిస్వామి ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్లు ఎల్లయ్య, రహమాన్, ఎస్‌ఐ రాంలాల్‌నాయక్, నాయకులు వెంకటేష్, ప్రతాప్, యాకోబు, రాజు పాల్గొన్నారు.