
ముంబై: మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించిన వ్యక్తిపై శివసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించిన నాయకుడిపై ఇంకుచల్లి పిడిగుద్దులతో దాడి చేయడమే కాకుండా చీరకట్టి ఊరేగింపు చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వెంటనే స్పందించి 17మందిని అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని పండరీపూర్‌లో బీజేపీ నేత శిరీశ్ కాటేకర్ సీఎం ఉద్దవ్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు అతడిపై ఇంకు చల్లి పిడిగుద్దులతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనకు బలవంతంగా చీర కట్టి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ దాడి విషయం తెలుసుకున్న పోలీసులు శివసేన నాయకులను అడ్డగించారు. పోలీసులను తోసివేసి మరీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తమ పార్టీ అధినేతపై కాటేకర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే అతడిపై దాడి చేసినట్లు శివసేన నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment