క్షణికావేశం.. ఇద్దరు మహిళల ప్రాణం తీసింది! | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. ఇద్దరు మహిళల ప్రాణం తీసింది!

Published Sun, May 5 2024 3:30 AM | Last Updated on Sun, May 5 2024 12:30 PM

క్షణికావేశం.. ఇద్దరు మహిళల ప్రాణం తీసింది!

క్షణికావేశం.. ఇద్దరు మహిళల ప్రాణం తీసింది!

 భార్యాభర్తల గొడవతో భార్య ఆత్మహత్య 

 కారణమని దూషించడంతో మరో మహిళ బలవన్మరణం

సిర్పూర్‌(టి): క్షణికావేశం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. భార్యాభర్తల మధ్య గొడవతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణమంటూ ఆమె భర్త కుటుంబ సభ్యులు దూషించడంతో ఎదురింట్లో ఉండే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. 

సిర్పూర్‌(టి) ఎస్సై డికొండ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బెస్తకాలనీకి చెందిన గాజిరెడ్డి రమ(35)ను భర్త గాజిరెడ్డి సురేష్‌ గత కొంతకాలంగా అనుమానంతో వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో రమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతిచెందింది.

ఆత్మహత్యకు కారణమంటూ..
ఇదే కాలనీలో దోని సరిత(30) రమ ఎదురు ఇంట్లో నివాసం ఉంటుంది. రమ, సరిత ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో పరిచయస్తులు. కాగా, తన భార్య రమకు సరిత మాయమాటలు చెబుతుండడంతోనే రోజు గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవల కారణంగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని సురేష్‌, కుటుంబ సభ్యులు సరితను అసభ్యకరంగా దూషించారు. దీంతో మనస్తాపం చెందిన సరిత శనివారం ఉదయం క్షణికావేశంలో వెంట్రుకలకు వేసుకునే కలర్‌ తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.

కేసు నమోదు
గాజిరెడ్డి సురేష్‌ గత ఏడాది కాలంగా తన కూతురు రమను అనుమానిస్తూ చిత్రహింసలకు గురి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి ఒడ్డెటి పోశక్క పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గాజిరెడ్డి సురేష్‌, ఆయన తల్లి గుండమ్మ, చెల్లె పద్మ అవమానకరంగా దూషించడంతోనే తన భార్య దోని సరిత ఆత్మహత్య చేసుకుందని భర్త దోని రాజేందర్‌ ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement