ఇలా వచ్చి.. అలా వెళ్తారు..!
ఇదీ ఆర్టీఏ కార్యాలయ ఏఓ తీరు
వరంగల్ నుంచి రైల్లో రాకపోకలు
వాహనదారులకు అందని సేవలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నాలుగు రోజులకు రూటర్ సమస్య పరిష్కారమై వాహనదారులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో పనులు పెండింగ్ పడుతున్నాయి. వరంగల్‌కు చెందిన ఏఓ స్వర్ణలత 2022 జనవరి 19న హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం నుంచి బదిలీపై మంచిర్యాలకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె వరంగల్ నుంచి మంచిర్యాలకు రైల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రోజువారీగా రైలు ప్రయాణం సాగిస్తుండగా భోజన విరామ సమయానికి వచ్చి విధుల్లో చేరకుండా కాలక్షేపం చేస్తూ బాధ్యతలు చేపడుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు వరంగల్‌కు ఉండే రైల్లో వెళ్తున్నారు. దీంతో ఆ సమయం వరకు మాత్రమే పనులు చేసి మిగతా పనులు వాయిదా వేస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం..
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏఓ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ గార్డు నుంచి మొదలు హోంగార్డు, పోలీసు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ విధులతోపాటు కార్యాలయ సిబ్బంది విధులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్స్‌పోర్టు వ్యవహారాలపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఏఓపై ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ అప్రూవ్, పర్మిట్ అప్రూవ్, సీసీ వ్యవహారాలు ఇలా ప్రధాన సేవలన్నీ ఏఓ లేనిదే ముందుకు సాగవు. కార్యాలయం హెల్ప్‌డెస్క్, ఆర్టీఐ అప్పిలేట్ అధికారి బాధ్యతలూ ఉంటాయి. మొత్తంగా జిల్లా రవాణా శాఖ అధికారి తర్వాత పూర్తి బాధ్యత ఏఓదే ఉంటుంది. ఇలాంటి కీలక పాత్ర పోషించాల్సిన ఏఓ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బందితోపాటు వివిధ సేవల కోసం వచ్చే వాహనదారులతో మొండిగా వ్యవహరిస్తూ పలు కొర్రీలతో పనులు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
అయినా తీరు మారలేదు..
నాలుగు రోజులుగా కార్యాలయంలో ఇంటర్‌నెట్ రూటర్ సమస్యతో వాహనదారుల సేవలు నిలిచిపోయాయి. గురువారం సేవలు పునరుద్ధరణతో వాహనదారులు వెల్లువెత్తుతున్నారు. ఏఓ ఉదయం 10:30 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు కూడా రాకపోవడంతో పలువురు తమ పనుల కోసం నిరీక్షించారు. గురువారం కొన్ని పనులు పూర్తి చేయకుండానే రైలు సమయం కావడంతో వెళ్లిపోగా.. శుక్రవారం ఆలస్యంగా వచ్చారు.
అప్పటికే స్లాట్‌ల సమయం ముగిసిపోవడంతో గురు, శుక్రవారాల్లో ఏఓ పనులు మళ్లీ పెండింగ్ అయ్యాయి. శుక్రవారం ఓ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సెలవులో ఉండగా వాహనదారులకు సత్వర సేవలు అందించాల్సిన ఏఓ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఏఓ విధులపై మంచిర్యాల ఇంచార్జి డీటీఓ సంతోష్‌ను సంప్రదించగా.. ఏఓ విధుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, సమయానికి కార్యాలయంలో ఉండాలని సూచించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment