transport department officers
-
ఇలా వచ్చి.. అలా వెళ్తారు..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నాలుగు రోజులకు రూటర్ సమస్య పరిష్కారమై వాహనదారులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో పనులు పెండింగ్ పడుతున్నాయి. వరంగల్‌కు చెందిన ఏఓ స్వర్ణలత 2022 జనవరి 19న హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం నుంచి బదిలీపై మంచిర్యాలకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె వరంగల్ నుంచి మంచిర్యాలకు రైల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రోజువారీగా రైలు ప్రయాణం సాగిస్తుండగా భోజన విరామ సమయానికి వచ్చి విధుల్లో చేరకుండా కాలక్షేపం చేస్తూ బాధ్యతలు చేపడుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు వరంగల్‌కు ఉండే రైల్లో వెళ్తున్నారు. దీంతో ఆ సమయం వరకు మాత్రమే పనులు చేసి మిగతా పనులు వాయిదా వేస్తున్నారు.విధుల్లో నిర్లక్ష్యం..జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏఓ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ గార్డు నుంచి మొదలు హోంగార్డు, పోలీసు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ విధులతోపాటు కార్యాలయ సిబ్బంది విధులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్స్‌పోర్టు వ్యవహారాలపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఏఓపై ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ అప్రూవ్, పర్మిట్ అప్రూవ్, సీసీ వ్యవహారాలు ఇలా ప్రధాన సేవలన్నీ ఏఓ లేనిదే ముందుకు సాగవు. కార్యాలయం హెల్ప్‌డెస్క్, ఆర్టీఐ అప్పిలేట్ అధికారి బాధ్యతలూ ఉంటాయి. మొత్తంగా జిల్లా రవాణా శాఖ అధికారి తర్వాత పూర్తి బాధ్యత ఏఓదే ఉంటుంది. ఇలాంటి కీలక పాత్ర పోషించాల్సిన ఏఓ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బందితోపాటు వివిధ సేవల కోసం వచ్చే వాహనదారులతో మొండిగా వ్యవహరిస్తూ పలు కొర్రీలతో పనులు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.అయినా తీరు మారలేదు..నాలుగు రోజులుగా కార్యాలయంలో ఇంటర్నెట్ రూటర్ సమస్యతో వాహనదారుల సేవలు నిలిచిపోయాయి. గురువారం సేవలు పునరుద్ధరణతో వాహనదారులు వెల్లువెత్తుతున్నారు. ఏఓ ఉదయం 10:30 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు కూడా రాకపోవడంతో పలువురు తమ పనుల కోసం నిరీక్షించారు. గురువారం కొన్ని పనులు పూర్తి చేయకుండానే రైలు సమయం కావడంతో వెళ్లిపోగా.. శుక్రవారం ఆలస్యంగా వచ్చారు. అప్పటికే స్లాట్ల సమయం ముగిసిపోవడంతో గురు, శుక్రవారాల్లో ఏఓ పనులు మళ్లీ పెండింగ్ అయ్యాయి. శుక్రవారం ఓ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సెలవులో ఉండగా వాహనదారులకు సత్వర సేవలు అందించాల్సిన ఏఓ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఏఓ విధులపై మంచిర్యాల ఇంచార్జి డీటీఓ సంతోష్‌ను సంప్రదించగా.. ఏఓ విధుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, సమయానికి కార్యాలయంలో ఉండాలని సూచించామని తెలిపారు. -
ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ రిటైర్డ్ రవాణా అధికారికే..!
సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను రిటైర్డ్ రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యామ్‌నాయక్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గం నుంచి మర్సుకోల సర్వసతి, అజ్మీరా శ్యామ్‌నాయక్, బుర్స పోచయ్య పేర్లను జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించగా.. గెలుపు గుర్రాలను బరిలో దించాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ శ్యామ్‌నాయక్ వైపే మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిద్ధం చేసిన తుది జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది. రెండోవారంలో అభ్యర్థుల తొలి జాబితాను వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో శ్యామ్‌నాయక్ పేరు ఉంటుందని తెలుస్తోంది. మొదలైన హడావుడి.. ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటించి అధికార పార్టీ ముందస్తుగానే సన్నద్ధం కావడంతో జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేయడంతో ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్‌ను ఎంపిక చేయాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పది మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు. అందులో ఇటీవల పార్టీలో చేరిన శ్యామ్‌నాయక్ కూడా ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మిని ఢీకొట్టాలంటే అందుకు శ్యామ్నాయకే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఇంజనీరింగ్ పట్టభద్రుడు.. జిల్లా ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి.. ఇక్కడే జిల్లా రవాణా శాఖాధికారిగా ఏడేళ్లపాటు పనిచేయడంతోపాటు సౌమ్యుడనే పేరున్న శ్యామ్‌నాయక్‌కు సర్వేలు కూడా అనుకూలంగా ఉండడంతో ఆయననే అభ్యర్థిగా ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిర్పూర్‌పై అనిశ్చితి..! సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడినట్లు సమాచారం. మొదటి విడత జాబితాలోనే ఈ నియోజకవర్గ అభ్యర్థి పేరును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇంతలోనే అధిష్టానం పునరాలోచనలో పడడం సిర్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సిర్పూర్ స్థానానికి నలుగురు ఆశావహులు దరఖాస్తులు చేయగా.. అక్కడ అభ్యర్థి ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఎవరిని పోటీకి దించాలా అనే అంశంపై పూర్థిస్తాయిలో పీసీసీలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సర్వేల ఆధారంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలడమే అందుకు కారణమని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీఎస్పీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు ఇస్తే ఎలా ఉంటుందనే యోచన చేస్తున్నట్లు సమాచారం. జోరు పెంచిన కాంగ్రెస్.. జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు? బరిలో నిలబడతారు అనే స్థితి నుంచి, వామ్మో ఇంతమంది టికెట్ కోసం పోటీ పడుతున్నారా? అనే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుండడంతో.. అధికార పార్టీని ఢీకొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్తోంది. వలసలతో జిల్లాలో చాలా కాలంగా స్తబ్ధుగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికలతో నూతనోత్సాహంతో కార్యక్రమాలను పెంచింది. అధిష్టానం పిలుపుతో ఆందోళనలు, వివిధ వర్గాలకు ఎన్నికల హామీగా ప్రకటిస్తున్న డిక్లరేషన్లపై గడపగడపకూ ప్రచారం కార్యక్రమాన్ని విస్తృతం చేసింది. -
అక్రమాల రూటు వదలని ప్రైవేటు ట్రావెల్స్
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల తీరు మారడం లేదు. ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. అడ్డుకోండి.. చూద్దాం అనే రీతిలో ట్రావెల్స్ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారాంతాల్లోనూ, పండుగల సీజన్లలో టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేసి ప్రయాణికుల నుంచి భారీగా దోచుకుంటున్నారు. పండుగలప్పుడు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. అదనపు బెర్తులు, సీట్లు ఏర్పాటు చేసి మరీ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సుల్ని తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ఆర్టీసీకి ఏటా రూ.2400 కోట్లు నష్టం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రవాణా అధికారులు షరా‘మామూలు’గానే మిన్నకుండిపోతున్నారు. సాక్షి, అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అదనపు సీట్లు/బెర్తుల ఏర్పాటుతో బస్సుల పొడవు పెంచి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోటారు వాహనాల చట్టంలో రూల్ 351ఎ ప్రకారం.. స్లీపర్ బస్సుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం.. బస్సులో 36 సీట్లు, 32 బెర్తులు ఉండాలి. కానీ అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లు, బెర్తులతో తెలుగు రాష్ట్రాల్లో తిరిగాయి. దీంతో ఆ రాష్ట్రాలు 2017 జూన్‌లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశాయి. ఆ తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఆ బస్సుల్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఏపీలో మళ్లీ బస్సుల్ని రవాణా శాఖ అనుమతించింది. సీట్లు, బెర్తులు తగ్గించి మోటారు వాహనాల చట్టంలో ఏఐఎస్–119 నిబంధనను అనుసరించి తిప్పాలని ట్రావెల్స్ నిర్వాహకులకు అధికారులు సూచించారు. అప్పట్లో అధికారుల ఆదేశాల మేరకు సీట్లు, బెర్తులు తగ్గించిన ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పుడు సంక్రాంతి సీజన్ డిమాండ్ దృష్ట్యా అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప తర్వాత షరా‘మామూలు’గానే వదిలేస్తున్నారు. అదనపు బెర్తులతో దందా.. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో ఇతర రాష్ట్రాల బస్సులను తిరగనిచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే రవాణా శాఖ ఎన్వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) కలిగి ఉండటంతోపాటు ఏఐఎస్ –119 ప్రకారం.. బెర్తుల సంఖ్య తగ్గించాలని స్పష్టం చేసింది. ఆలిండియా పర్మిట్లు పొంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బస్సుల్లో స్లీపర్ బెర్తులు 36 వరకు ఉన్నాయి. ఇలా ఉండటం మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలకు విరుద్ధం. ఈ బస్సులు ఏపీలో తిరగాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ ప్రకారం.. బెర్తులను 30కి తగ్గించి తిప్పాల్సిందే. తనిఖీలకు మంగళం! కేంద్ర మోటారు వాహనాల చట్టం 125 సి (4) ప్రకారం.. ప్రభుత్వ రవాణా సంస్థలు, రాష్ట్ర, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు ట్రావెల్స్ మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో ఏఐఎస్–119 నిబంధనలున్న బెర్తుల బస్సులు కేవలం రెండు మాత్రమే ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు బెర్తులను 36 నుంచి 30కి తగ్గిస్తేనే వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లతో రవాణా శాఖ తనిఖీలకు మంగళం పాడింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యథేచ్ఛగా ఆన్లైన్లో రిజర్వేషన్లు చేస్తూ ఆక్యుపెన్సీ పెంచుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న బెర్తుల బస్సులు రాష్ట్రంలో 655 ఉన్నాయి. రవాణా అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ బస్సులు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా అనే అంశంలో లేకపోవడం గమనార్హం. హైదరాబాద్ రూటే టార్గెట్ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రధానంగా హైదరాబాద్ రూట్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఈ రూట్లోనే అధికంగా బస్సులు నడిపి.. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు పొంది.. స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ రోజూ 70 వేల మంది ప్రయాణికుల్ని చేరవేస్తున్నారు. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఏసీ సర్వీసుకు రూ.550గా ఉన్న టిక్కెట్టు ధరను పండుగలు, రద్దీ సమయాల్లో రూ.990కు పెంచి వసూలు చేస్తున్నారు. స్లీపర్ సర్వీసుల్లో సాధారణ రోజుల్లో రూ.850–రూ.1000గా ఉన్న టిక్కెట్టు ధరను ఈ సీజన్లో రూ.1,200 – రూ.1,850కు పెంచి వసూలు చేయడం గమనార్హం. హైదరాబాద్ – విశాఖపట్నం రూట్లోనూ సాధారణ రోజుల్లో స్లీపర్ సర్వీసుల్లో రూ.1,500– రూ.1,700 ఉండే టిక్కెట్ ధరను పండుగల సీజన్లో ఏకంగా రూ.2,500 – రూ.2,700కు వరకు పెంచి వసూలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో.. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ల గుర్తింపునకు, వారి సంక్షేమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖచ్చితంగా చేపట్టాల్సిందేనని హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే డ్రైవర్ల రిజిస్ట్రేషన్ విషయంలో కార్మిక శాఖ, రవాణా శాఖలు తమ బాధ్యత కాదంటే తమది కాదని కొన్నాళ్లపాటు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ విషయం మీద హైకోర్టు సీరియస్‌గా స్పందించడంతో రవాణా శాఖ డ్రైవర్ల సంక్షేమ చట్టం అమలు బాధ్యత తీసుకుంది. సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల మాటున యథేచ్ఛగా సరుకు తరలిస్తున్నాయి. చెన్నై, బెంగళూరుల నుంచి జోరుగా జీరో వ్యాపారం నిర్వహించేవారికి ఊతమిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులు పొంది స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.2,400 కోట్లు నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఆర్టీసీ ఆక్యుపెన్సీని దెబ్బకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ కార్గో వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రైవేటు బస్సుల్లో వెండి, ఫర్నీచర్ సామగ్రి పెద్ద ఎత్తున మళ్లిపోతోంది. బిల్లులు లేకుండా సామగ్రిని తరలిస్తున్నా రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ప్రైవేటు బస్సుల్లో బాణాసంచా తరలించడంతో అగ్నిప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో సరుకులు తరలించకూడదనే నిబంధన ఉన్నా.. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా పెడచెవిన పెట్టి ఆయా నగరాల్లో సరుకులను తరలించేందుకు ఏకంగా బుకింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇష్టారాజ్యంగా టిక్కెట్ ధరలు పెంపు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఇష్టారాజ్యంగా టిక్కెట్ ధరలను పెంచి ప్రయాణికుల అవసరాలను భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సీజన్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీ చేస్తే అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులు పడతారని రవాణా అధికారులు చెబుతున్నారంటే.. వీరి దోపిడీకి ఏ విధంగా సహకరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. టిక్కెట్ల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని రవాణా అధికారులు చేతులెత్తేయడంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు తమకు అడ్డే లేదన్న రీతిలో ప్రయాణికుల్ని దోచుకుంటున్నారు. ఏటా ఈ దందా సాగుతూనే ఉందే తప్ప ట్రావెల్స్ కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సాధారణంగా పండుగ సీజన్ల ముందు ఆయా జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు ముందుగా ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని వారి వారి ప్రాంతాలకు చేరవేయడంలో సహకరించాలని, టిక్కెట్ల ధరలు పెంచి ప్రయాణికుల్ని దోచుకోవద్దని హెచ్చరికలు చేయాలి. అంతేకాకుండా టిక్కెట్ల ధరల నియంత్రణపై ట్రావెల్స్ నిర్వాహకుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి ఏ జిల్లాలోనూ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులు: 750 వీటిలో 2 ప్లస్ వన్ బెర్తులున్న బస్సులు: 600 రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సుల సంఖ్య: 491 ఈ బస్సుల్లో రోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య: 70 వేలు రాష్ట్ర పరిధిలో స్లీపర్ బస్సుల సంఖ్య: 50 ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఆగడాలకు అద్దంపట్టే కొన్ని సంఘటనలు తిరుపతికి చెందిన ఎస్.లక్ష్మీపవన్ సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. బస్సు టికెట్ బుక్ చేసుకోవడం కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా సెమీ స్లీపర్ ఏసీ బస్సుకు రూ.1900 చెల్లించాలని చెప్పడంతో బిత్తరపోయాడు. అంతకుముందు పలుమార్లు రూ.1000తోనే హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన ఆయనకు ఈసారి ట్రావెల్స్ నిర్వాహకులు రూ.900 ఎక్కువ చెప్పడంతో చేసేదేమీ లేక వారు అడిగినంతా చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి.ప్రమోద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు ఊరికి రావడానికి టికెట్ కోసం ప్రయత్నించగా ఆర్టీసీ, రైల్వే టికెట్లు అప్పటికే అయిపోయాయి. దీంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ సూపర్ లగర్జీ బస్సుకు రూ.1000 ఇమ్మనడంతో కంగుతిన్నాడు. విడిరోజుల్లో హైదరాబాద్ నుంచి తెనాలికి రూ.450 తీసుకునేవారని, ఇప్పుడు రెట్టింపు వసూలు చేస్తున్నారని ప్రమోద్ వాపోతున్నాడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బి.సురేశ్ హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. సంక్రాంతి పండుగకు తన ఊరికి రావడం కోసం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లగా వారు సాధారణ లగ్జరీ బస్సుకు రూ.1700 చెల్లించాలని చెప్పడంతో విస్తుపోయాడు. హైదరాబాద్ నుంచి అనకాపల్లికి రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఛార్జీ అని చెప్పగా ‘ఇష్టముంటే ఎక్కు.. లేదంటే మానుకో’ అని ట్రావెల్స్ నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. -
ఒకటి కాదు.. 2
సాక్షి, కడప : వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలు కాబోతోంది. బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్ ధరిస్తే చాలని చాలా మంది భావించారు. ఆ మేరకే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇపుడు తీరా గడువు దగ్గర పడ్డాక ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి అని రవాణా శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 3.28 లక్షల టూవీలర్లు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగం బైకుల్లో ఇద్దరు (భార్య భర్త, అక్కా తమ్ముడు, స్నేహితుడో, బంధువో) ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 5 లక్షల హెల్మెట్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రజలందరి వద్ద ఇందులో పాతిక శాతం హెల్మెట్లు కూడా లేవు. ఐదు రోజుల్లో వీరందరూ హెల్మెట్లు కొనుగోలు చేయడం అన్నది సాధ్యం కానిది. రవాణా శాఖ మాత్రం అదే జరగాలని కోరుకుంటోంది. భారీగా ఫైన్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రసీదు పుస్తకాలు పెద్ద సంఖ్యలో ముద్రించుకుని సిద్ధం చేసుకున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులు, ఫుట్‌పాత్‌ల పక్కన హెల్మెట్ల అమ్మకం ఊపందుకుంది. ఒకసారి ఫైన్ వేస్తే రూ.500 చెల్లించాల్సి వస్తుందని, ఎందుకొచ్చిన గొడవ అంటూ నగర, పట్టణ వాసులు మాత్రం రెండు హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. నేషనల్ హైవేలు, ఊరి బయట ప్రయాణించే వారికి మాత్రమే హెల్మెట్ తప్పని సరి చేస్తే బావుంటుందని నగర, పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున 20-30 కిలోమీటర్ల స్పీడు కంటే ఎక్కువగా ప్రయాణించలేమంటున్నారు. -
కళ్లు తెరిచిన రవాణాశాఖ!
విజయనగరంఫోర్ట్, న్యూస్‌లైన్ :. నిబంధనలకు తిలోదకాలిస్తూ.. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయంపై పత్రికల్లో ఎప్పటికప్పుడు కథనాలు వెలువడుతున్నా... రవాణాశాఖాధికారులు పట్టించుకున్న సందర్భం లేదు. తాజాగా మహబూబ్‌నగర్ దుర్ఘటనతో కళ్లు తెరిచారు. ట్రావెల్ బస్సులపై శుక్రవారం దాడులు నిర్వహించారు. 10 బస్సులపై దాడులు చేయగా.. అందులో మూడు సర్వీసులు నిబంధనలను విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. రెండు బస్సులపై కేసులు నమోదు చేసి విడిచిపెట్టారు. మరో బస్సును సీజ్ చేశారు. విజయనగరానికి చెందిన వెంకటరమణ ట్రావెల్స్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్‌గా తిరుగుతుండడంతో సీజ్ చేశారు. దీనిని విశాఖ నగరంలోని మద్దిలపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. నవీన్ ట్రావెల్స్(ఛత్తీస్‌గఢ్)కు చెందిన రెండు బస్సుల్లో ప్రయాణికుల వివరాలతో కూడిన జాబితా లేదు. అదేవిధంగా అత్యవసర ద్వారం, నిప్పు ఆర్పే పరికరం, రెండో డ్రైవర్ లేకపోవడంతో ఈ రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. నేడూ కొనసాగనున్న దాడులు శనివారం కూడా రవాణా శాఖ అధికారులు ట్రావెల్ బస్సులపై దాడులు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. ఈ దాడులను కొనసాగిస్తారా? లేదా గతంలో మాదిరి రెండు మూడు రోజులకే పరిమితం చేస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్నాళ్లూ ట్రావెల్ బస్సుల యజమానులు నిబంధనలు పాటించకపోయినా.. అధికారులు చూసీచూడనట్లు ఊరుకున్నారు. పత్రికల్లో కథనాలు వెలువడినా చలించలేదు. మహబూబ్‌నగర్ ఘటనలో 45 మంది అమాయకులు మృతి చెందడంతో స్పందించి దాడులు చేపడుతున్నారు. అంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతే గానీ అధికారులు కళ్లు తెరవరా? అని పలువురు చర్చించుకుంటున్నారు.