సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను రిటైర్డ్ రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యామ్‌నాయక్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గం నుంచి మర్సుకోల సర్వసతి, అజ్మీరా శ్యామ్‌నాయక్, బుర్స పోచయ్య పేర్లను జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించగా.. గెలుపు గుర్రాలను బరిలో దించాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ శ్యామ్‌నాయక్ వైపే మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే నెల మొదటి వారంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిద్ధం చేసిన తుది జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది. రెండోవారంలో అభ్యర్థుల తొలి జాబితాను వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో శ్యామ్‌నాయక్ పేరు ఉంటుందని తెలుస్తోంది.
మొదలైన హడావుడి..
ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటించి అధికార పార్టీ ముందస్తుగానే సన్నద్ధం కావడంతో జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేయడంతో ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్‌ను ఎంపిక చేయాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పది మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు. అందులో ఇటీవల పార్టీలో చేరిన శ్యామ్‌నాయక్ కూడా ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మిని ఢీకొట్టాలంటే అందుకు శ్యామ్‌నాయకే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఇంజనీరింగ్ పట్టభద్రుడు.. జిల్లా ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి.. ఇక్కడే జిల్లా రవాణా శాఖాధికారిగా ఏడేళ్లపాటు పనిచేయడంతోపాటు సౌమ్యుడనే పేరున్న శ్యామ్‌నాయక్‌కు సర్వేలు కూడా అనుకూలంగా ఉండడంతో ఆయననే అభ్యర్థిగా ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సిర్పూర్‌పై అనిశ్చితి..!
సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడినట్లు సమాచారం. మొదటి విడత జాబితాలోనే ఈ నియోజకవర్గ అభ్యర్థి పేరును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇంతలోనే అధిష్టానం పునరాలోచనలో పడడం సిర్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సిర్పూర్ స్థానానికి నలుగురు ఆశావహులు దరఖాస్తులు చేయగా.. అక్కడ అభ్యర్థి ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఎవరిని పోటీకి దించాలా అనే అంశంపై పూర్థిస్తాయిలో పీసీసీలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సర్వేల ఆధారంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలడమే అందుకు కారణమని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీఎస్పీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు ఇస్తే ఎలా ఉంటుందనే యోచన చేస్తున్నట్లు సమాచారం.
జోరు పెంచిన కాంగ్రెస్..
జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు? బరిలో నిలబడతారు అనే స్థితి నుంచి, వామ్మో ఇంతమంది టికెట్ కోసం పోటీ పడుతున్నారా? అనే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుండడంతో.. అధికార పార్టీని ఢీకొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్తోంది. వలసలతో జిల్లాలో చాలా కాలంగా స్తబ్ధుగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికలతో నూతనోత్సాహంతో కార్యక్రమాలను పెంచింది. అధిష్టానం పిలుపుతో ఆందోళనలు, వివిధ వర్గాలకు ఎన్నికల హామీగా ప్రకటిస్తున్న డిక్లరేషన్లపై గడపగడపకూ ప్రచారం కార్యక్రమాన్ని విస్తృతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment