ఎన్నికలవేళ బీజేపీ, బీఆర్‌ఎస్‌కు షాక్ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలవేళ బీజేపీ, బీఆర్‌ఎస్‌కు షాక్

Published Thu, Sep 28 2023 12:36 AM | Last Updated on Thu, Sep 28 2023 8:03 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా ఊహించని ట్విస్ట్‌లు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌ వైపు చూస్తుండటం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది. బోథ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెబుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించడం లేదు. అలాగని కాంగ్రెస్‌లో చేరబోయే విషయంపై కూడా బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇది వ్యూహాత్మక మౌనమా? అనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది.

కొనసాగుతున్న ఉత్కంఠ
నెల క్రితం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆదిలాబాద్‌ నుంచి జోగు రామన్న, బోథ్‌ నుంచి నేరడిగొండ జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌ జాదవ్‌, ఖానాపూర్‌ నుంచి భూక్య జాన్సన్‌నాయక్‌, ఆసిఫాబాద్‌ నుంచి కోవ లక్ష్మిని పార్టీ ప్రకటించింది. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏకంగా ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, ఆత్రం సక్కు, రాథోడ్‌ బాపురావుకు టిక్కెట్‌ దక్కలేదు. ఆత్రం సక్కుకు ముఖ్యమైన పదవి విషయమై పార్టీ నుంచి హామీ లభించినట్లు బీఆర్‌ఎస్‌లో చర్చ సాగుతోంది. రేఖానాయక్‌, రాథోడ్‌ బాపురావుకు అలాంటి పరిస్థితి లేదు.

బోథ్‌ ఎమ్మెల్యే రెండ్రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని చెబుతున్నారు. మంగళవారం ఆయన నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అక్కడ కూడా ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి హామీ లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికీ పార్టీకి రాజీనామా విషయంలో ఆయన స్టాండ్‌ కొనసాగుతోంది. ఇక రేఖానాయక్‌ ఇంతకుముందు ప్రకటించినట్లే పార్టీ మారుతారా.. లేనిపక్షంలో ఆమె నిర్ణయం ఎలా ఉంటుందనేది మున్ముందు తేలనుంది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాల కోసం ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ తొలి జాబితా అక్టోబర్‌ మొదటి వారంలో ఉంటుందని ఆ పార్టీ పెద్దలు చెబుతుండగా, దాంట్లో ఈ నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల్ని ప్రకటిస్తారా? మలివిడతలోనే స్పష్టమవుతుందా..? అనేది వేచిచూడాల్సిందే. ఇక బీజేపీ జాబితాపై కూడా అందరి ఆసక్తి నెలకొంది. ఆయా అభ్యర్థుల్ని ప్రకటించే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

కాంగ్రెస్‌ స్కెచ్‌..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవాలని కాంగ్రెస్‌ స్కెచ్‌ వేస్తోంది. ప్రధానంగా ఆది లాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అధికమంది అభ్యర్థులకు చట్టసభలకు పోటీ చేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో లోకసభ పరిధిలో ఒక సీని యర్‌ నేతను ఏదైన నియోజకవర్గం నుంచి బరి లో నిలపడం ద్వారా మిగతా నియోజకవర్గాలను సమన్వయపర్చుకునేలా ఉండాలన్నది పార్టీ వ్యూ హమని ఓ ముఖ్య నేత పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పార్టీలోకి వస్తున్నారని ఏ కంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి ఏఐ సీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలోనే చర్చకు వ చ్చిందనడం రాష్ట్రంలోనే ప్రాధాన్యత అంశంగా మారింది. ఎంపీ పార్టీ మారితే అది బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే.

బోథ్‌ నియోజకవర్గం నుంచి సో యంను బరిలోకి దింపాలన్నది ఆ పార్టీ వ్యూహంగా చర్చించుకుంటున్నారు. తద్వారా ఉమ్మడి జి ల్లాలో బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న ఆదివాసీలపై దృష్టి సారించారు. కాగా, ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో మూడు ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు ఉండగా, రెండుచోట్ల ఆదివాసీలను బరిలోకి దించాలన్నదే పార్టీ ప్లాన్‌గా చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement