ప్రతిభకు చోటు లేదు.. క్రమశిక్షణ అవసరమే లేదు.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు చోటు లేదు.. క్రమశిక్షణ అవసరమే లేదు..

Published Sun, Oct 1 2023 12:32 AM | Last Updated on Sun, Oct 1 2023 1:42 PM

- - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రతిభకు చోటు లేదు.. క్రమశిక్షణ అవసరమే లేదు.. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి అవసరం లేదు. బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా ప్రజాప్రతినిధుల అండదండలు.. వారి ఆశీస్సులు. ఇవి ఉంటే చాలు.. కావాల్సిన చోట నియామకం.. కోరినన్ని రోజులు ఒకేచోట విధులు. జిల్లా పోలీసు శాఖలో ఎస్సై, సీఐ, డీస్పీల బదిలీలు, నియామకాలపై రాజకీయ ముద్ర నానాటికీ పెరిగిపోతోంది. పోలీసు అధికారుల బదిలీల్లో ప్రజాప్రతినిధులకు ఆది నుంచి ప్రమేయం ఉన్నా కొన్నేళ్లుగా ఇది మరింత పెరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత జిల్లాలో కీలక ప్రజాప్రతినిధుల ఆదేశం లేకుండా ఏఒక్క ఎస్సై, సీఐ, డీఎస్పీ బదిలీ జరగలేదంటే అతిశయోక్తి కాదు.

నమ్మిన బంట్ల కోసం...
రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మిని ఆసిఫాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత నియోజకవర్గ అధికార పెత్తనం ఆమెకే కట్టబెట్టారు. ఈ మేరకు ఆమె మాటే వినాలని జిల్లా ఉన్నతాధికారులకు సైతం మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమస్యలు ఉండవనే భావనతో కోవ లక్ష్మి పోలీసు అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

తమకు విధేయులుగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలు అయితే ఎన్నికల్లో తమ గెలుపునకు ఎంతో కొంత ఉపకరిస్తారని.. గెలుపుపై ప్రభావం చూపకపోయినా.. తమ కార్యకలాపాలకు ఎదురురారన్న ఆశాభావంతో ఆమె తన పలుకుబడి ఉపయోగించి ఆసిఫాబాద్‌ డీఎస్పీని బదిలీ చేయించి తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికి పోస్టింగ్‌ ఇప్పించారని ప్రచారం పోలీసు శాఖలో జరుగుతోంది. డీఎస్పీ తర్వాత ఆసిఫాబాద్‌ బీఆర్‌ఎస్‌ నేత కన్ను సీఐలపై పడినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్‌ పోలీసు స్టేషన్‌కు ఇటీవల వరంగల్‌ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సీఐ సురేష్‌తో పాటు వాంకిడి సీఐ శ్రీనివాస్‌, రెబ్బెన సీఐ సురేందర్‌ను సైతం మార్చాలని బీఆర్‌ఎస్‌ నేత పట్టుబట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆసిఫాబాద్‌ సీఐకి స్థాన చలనం జరిగినట్లు తెలిసింది.

రామగుండం పరిధిలో పనిచేస్తున్న రాజు అనే సీఐ ఇక్కడికి బదిలీపై వస్తున్నారని సమాచారం. గతంలో ఆయన బెల్లంపల్లి సీఐగా పనిచేశారు. కాగా తొలుత వాంకిడి, రెబ్బెన సీఐలను మార్చలనే యోచనలో ఉన్న కోవ లక్ష్మి ఆతర్వాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వారిని ఎన్నికల వరకు ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డీఎస్పీ, సీఐల బదిలీ వెనుక మాజీ ఎమ్మెల్సీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయ పైరవీలు...
త్వరలో ఎన్నికలు రానున్నాయి. కోడ్‌ కూసిందంటే అన్ని ప్రభుత్వ శాఖల్లో మూడేళ్లకంటే ఎక్కువ పనిచేసే సర్కారు ఉద్యోగులను బదిలీ చేయాలన్నది ఎన్నికల కమిషన్‌ నిబంధన. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లాలో మూడేళ్లకు పైగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఆయా శాఖల అధికారులకూ సూచించారు. ఇందులో భాగంగా పోలీసు శాఖ ఇప్పటికే ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడేళ్లకు పైగా పనిచేస్తున్న ఎస్సై, సీఐలను బదిలీ చేసింది.

జిల్లాలో రెండు పోలీసు డివిజన్‌లున్నాయి. ఆయా డివిజన్లలో పనిచేసే కొందరిపై ఆరోపణలు ఉండగా.. మరికొందరికి మూడేళ్ల కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో బదిలీలు తప్పనిసరి అయ్యాయి. అయితే ఈ బదిలీలన్నీ రాజకీయ పైరవీలతో జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement