ఒకటి కాదు.. 2
సాక్షి, కడప : వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలు కాబోతోంది. బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్ ధరిస్తే చాలని చాలా మంది భావించారు. ఆ మేరకే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇపుడు తీరా గడువు దగ్గర పడ్డాక ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి అని రవాణా శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 3.28 లక్షల టూవీలర్లు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగం బైకుల్లో ఇద్దరు (భార్య భర్త, అక్కా తమ్ముడు, స్నేహితుడో, బంధువో) ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 5 లక్షల హెల్మెట్లు కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జిల్లా ప్రజలందరి వద్ద ఇందులో పాతిక శాతం హెల్మెట్లు కూడా లేవు. ఐదు రోజుల్లో వీరందరూ హెల్మెట్లు కొనుగోలు చేయడం అన్నది సాధ్యం కానిది. రవాణా శాఖ మాత్రం అదే జరగాలని కోరుకుంటోంది. భారీగా ఫైన్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రసీదు పుస్తకాలు పెద్ద సంఖ్యలో ముద్రించుకుని సిద్ధం చేసుకున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులు, ఫుట్‌పాత్‌ల పక్కన హెల్మెట్ల అమ్మకం ఊపందుకుంది.
ఒకసారి ఫైన్ వేస్తే రూ.500 చెల్లించాల్సి వస్తుందని, ఎందుకొచ్చిన గొడవ అంటూ నగర, పట్టణ వాసులు మాత్రం రెండు హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. నేషనల్ హైవేలు, ఊరి బయట ప్రయాణించే వారికి మాత్రమే హెల్మెట్ తప్పని సరి చేస్తే బావుంటుందని నగర, పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున 20-30 కిలోమీటర్ల స్పీడు కంటే ఎక్కువగా ప్రయాణించలేమంటున్నారు.