కౌంట్‌డౌన్ షురూ..
48 గంటలే గడువు
నెల్లూరు(క్రైమ్) : హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరిగా ధరించేందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. కేవలం 48 గంటలు మాత్రమే ఉంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ హెల్మెట్లు, సీటుబెల్టులు తప్పనిసరి చేయాలని అన్నీ జిల్లాల పోలీసు అధికారులను డీజీపీ జె.వి రాముడు ఆదేశించారు. గతంలో హెల్మెట్ వినియోగాన్ని పలు దఫాలు అమలుచేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించినప్పటికీ అవి మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది.
హెల్మెట్, సీటుబెల్టు వినియోగం పక్కాగా అమలు చేయాలంటే తొలుత సిబ్బంది అందరూ వాటిని ఆచరిస్తేనే ఫలితాలు సాధించగలమని ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ భావించారు. అందులోభాగంగానే జిల్లాలోని పోలీసు సిబ్బంది అందరూ ఈనెల 15లోపు విధిగా హెల్మెట్, సీటుబెల్టు ధరించాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కొంతమంది సిబ్బంది ఇప్పటికే వాహనచోదన సమయంలో విధిగా హెల్మెట్, సీటుబెల్టులు ధరిస్తుండగా ఇంకా అనేకమంది వాటి జోలికే వెళ్లలేదు. మరో 48గంటల్లో ఎస్పీ ఇచ్చిన గడువు ముగియనుంది. ఎస్పీ ఆదేశాలను పాటించాల్సిన సిబ్బందే ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం చూస్తుంటే జూలై ఒకటి నుంచి హెల్మెట్, సీటు బెల్టు ధరించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న అందరిలో నెలకొంది.