సాక్షి, చెన్నై: హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళుతున్న యువతిని పోలీసులు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున లారీ బంంగా ఢీకొంది. దీంతో యువతి కాళ్లపై నుంచి లారీ చక్రం ఎక్కిదిగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపైనే రాస్తారోకో చేపట్టారు. వివరాలు.. చెన్నై సెన్‌గుండ్రమ్ సమీపంలోని పాడియనల్లూర్ జ్యోతినగర్‌కు చెందిన యువనేష్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల ప్రియా (23) అనే యువతితో వివాహం జరిగింది. శుక్రవారం ప్రియా తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కొనడానికి స్కూటర్‌పై రాత్రి 7.30 గంటల సమయంలో కేకేనగర్ సమీపంలోని బేకరీకి వెళ్లింది. అదే సమయంలో సెన్‌గుండ్రమ్–తిరువళ్లూరు రోడ్డుపై ఎస్‌ఐ కుమారన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. కేక్ కొన్నుకుని తిరుగు ప్రయాణమైన ప్రియాను హెల్మెట్ ధరించకపోవడంతో కానిస్టేబుల్ ఆపమని కర్రతో సైగ చేశాడు.
ప్రియా హఠాత్తుగా బ్రేక్ వేసింది. అదే సమయంలో సెన్‌గుండ్రమ్ నుంచి వస్తున్న లారీ స్కూట్‌ను ఢీకొంది. అదుపుతప్పి కిందపడిన ప్రియాపై లారీ చక్రం ఎక్కిదిగడంతో ఆమె రెండు కాళ్లు చితికిపోయాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన చెన్నై ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ప్రియా కిందపడడానికి పోలీసులే కారణమని ఆగ్రహించిన స్థానికులు రాస్తారోకో చేపట్టారు. లారీ అద్దాలను ధ్వంసం చేశారు. ఓ బైక్‌ను తగుబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో తిరువళ్లూరు ఎస్పీ అరవిందన్, ఇన్‌స్పెక్టర్లు, సబ్ – ఇన్‌స్పెక్టర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా మార్పు రాకపోవడంతో లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment