ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు, మృతులు అజయ్, రాజ, రాహుల్, అరవింద్ (ఫైల్)
సాక్షి, చెన్నై: తమతో చదువుకున్న సహచరుల్ని కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లగ్జరీ కారు లో చెన్నైకు వచ్చిన మిత్రులను రోడ్డు ప్రమాదం కబలించింది. వివరాలు.. ఆదివారం వేకువజామున శివారులోని పెరుంగళత్తూరులో ఆగి ఉన్న లారీని లగ్జరీ కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు మిత్రులు అక్కడికక్కడే మరణించారు. సేలం జిల్లా మేట్టూరుకు చెందిన నవీన్(23), రాజా హరీస్ (22), తిరుచ్చికి చెందిన అజయ్ (23), పుదుకోట్టైకు చెందిన రాహుల్(22) ఈ ఏడాది తురైపాక్కంలోని ఓ ప్రైవేటు వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ ముగించారు.
చెన్నైలో ఉన్న తమ మిత్రుల్ని కలుసుకోవాలని నవీన్ ఇటీవల నిర్ణయించాడు. రాజా, అజయ్, రాహుల్‌తో కలిసి లగ్జరీ కారులో శనివారం చెన్నైకు వచ్చాడు. వీరంతా కారపాక్కంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. పలువురు మిత్రుల్ని కలిశారు. టీ నగర్‌లో షాపింగ్ కూడా చేశారు. చెన్నైకు చెందిన మిత్రుడు అరవింద్ శంకర్‌ను తమ వెంట గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో వారందరూ కలసి లగ్జరీ కారులో చెన్నై శివారుల్లో చక్కర్లు కొట్టేందుకు బయలుదేరారు.
చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’
ఘటనా స్థలంలోనే..
వండలూరు నుంచి పెరుంగళత్తూరు వైపుగా కారులో స్నేహితులందరూ వేగంగా దూసుకొచ్చారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో జీఎస్‌టీ రోడ్డులోని ఐటీ కారిడార్ సమీపంలోకి రాగానే, కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఇనుము లోడుతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొనడంతో క్షణాల్లో కారు పూర్తిగా ధ్వంసమైంది. తాంబరం, క్రోంపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకుని ఉన్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికే కారులో ఉన్న ఐదుగురు మరణించారు. దీంతో మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోం పేట జీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్
Comments
Please login to add a commentAdd a comment