జనసంద్రమైన దీక్షభూమి
నార్నూర్: మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామంలో జాతీయ బంజారా దీక్ష భూమి జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి లంబాడి గిరిజనులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. పీఠాధిపతి దీక్షగురువు సద్గురు శ్రీ ప్రేమ్‌సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో గురుకృప దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్, జగదాంబదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భోగ్ బండారో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం నుంచి శ్రీ సేవాలాల్ మహరాజ్ పల్లకితో బయల్దేరిన శోభాయాత్ర నార్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చేరుకుంది. అక్కడి నుంచి సంప్రదాయ నృత్యాలు ఆటపాటలతో దీక్షభూమి వద్ద చేరగా భక్తులకు దీక్ష గురువు ఆశీర్వదించారు. లంబాడి మహిళలు సంప్రదాయ నృత్యాలు, పాటలతో హోరెత్తించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాదవ్, కోవలక్ష్మి, కుమురం భీం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్‌నాయక్‌లు పూజలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తపల్లి(హెచ్) గ్రామంలో ఉన్న ఏకై క బంజారా జాతీయదీక్ష భూమి అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం దీక్ష గురువు మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతోనే సమాజం జాగృతం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 5 వేల మంది పైగా తరలివచ్చారు. నార్నూర్ సీఐ రహీంపాషా ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు బానోత్ జగన్, కవి గాయకుడు బంకట్‌లాల్, నాయక్ ఠాక్రునాయక్, బీజేపీ నాయకులు రాథోడ్ రితేశ్, రాథోడ్ శేషారావు, మాజీ సర్పంచ్ చౌహన్ డిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గురుకృప దినోత్సవం
భోగ్ బండారో నిర్వహించిన దీక్ష గురువు
పాల్గొన్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు


