నిధుల్లేవ్.. విధులకు రారు!
● పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాది ● ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు గ్రామాలు ● పెరిగిన పనిభారం..పర్యవేక్షణపై ప్రభావం
కోటపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలై ఏడాది ముగిసింది. ఒక్కో పంచాయతీకి ఒక్కో అధికారిని నియమించాల్సి ఉండగా..అధికారుల కొరత కారణంగా రెండు నుంచి మూడు గ్రామాలకో ప్రత్యేకాధికారిని నియమించారు. దీంతో పనిభారం పెరిగి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించింది. పంచాయతీలతోపాటు మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులు గా నియమించినా వారు పట్టించుకున్నా దాఖలాలు లేవు. సొంతశాఖల్లో పనిభారంతో పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమావేశాలు, సంతకాలకే పరిమితమవుతుండటంతో పాలన పడకేసింది. నిధులు లేమి, పర్యవేక్షణ లోపం, పాలన వ్యవహారాలు చూసేవారు కరవై ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. జీపీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు గతేడాది నిలిచిపోయాయి. నిధుల రాక పల్లెల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటోంది.
భారమంతా కార్యదర్శిపైనే..
పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడం, నిధుల లేమితో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ నీటి సరఫరా ప్రభుత్వ పథకాల సర్వే, ట్రాక్టర్, ట్యాంకర్ల నిర్వహణ, తాగునీటి పథకాల మరమ్మతు, పైపులైన్లు లీకేజీలు, వీధి దీపాలు ఇలా పలు రకాల పనుల కోసం పలువురు కార్యదర్శులు సొంత డబ్బులను వెచ్చించాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సరిపడా విడుదల కాకపోవడంతో కష్టంగా మారింది. నిధుల కొరతతో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకలేక వారితో పనిచేయించడం కష్టతరంగా మారింది. పార్‌పల్లిలో నిధుల కొరతతో వాటర్ ట్యాంకర్ నెలల తరబడి తీయకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇలా ఒక్క జీపీల్లో కాదు జిల్లాలోని పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లపై భారం పెరిగి తీయడం లేదని కార్యదర్శులే చెబుతున్నారు.
వేసవి గట్టెక్కేనా..
పల్లెల్లో ముఖ్యంగా వేసవిలో తాగునీటి అవసరాలతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ ముఖ్యం. భగీరథ నీరు పల్లెలకు సక్రమంగా చేరకపోవడంతో స్థానిక వనరులపై ఆధారపడతారు. తాగునీటి పథకాల్లో నీటివనరులు లేని గ్రామాల్లో మంచినీటి కటకట త ప్పదు. ట్యాంకర్లు, అద్దె బోర్లు, ఇతర ప్రత్యామ్నా య చర్యలు తీసుకోవాలన్నా పంచాయతీల్లో నిధులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్రత్యేకాధికారుల పాలనలో వేసవి ఎలా గట్టెక్కుతుందోనని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎండాకాలంలో వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తాయి. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకాధికారులు గ్రామాలను పట్టించుకుని తగిన చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
జిల్లా మండలాలు పంచాయతీలు
ఆదిలాబాద్ 17 468
కుమురంభీం 15 335
నిర్మల్ 18 396
మంచిర్యాల 16 311
సమస్యలు ఇవీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక చిన్న పంచాయతీల్లో గతంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారింది.
పల్లె ప్రకృతివనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్వహణ కొరవడ్డాయి.
గతంలో పల్లెలకు పంపిణీ చేసిన చెత్తడబ్బాలు చెడిపోయి కొత్తవి కొనలేక పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది.
కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లకు డిజీల్‌కు డబ్బులు వెచ్చించలేక రోడ్లపై చెత్త దర్శనమిస్తోంది. పలుచోట్ల కార్యదర్శులు డిజీల్ కోసం అప్పులు చేస్తున్నారు.
వీధి దీపాలు మరమ్మతుకు గురైన వాటిస్థానంలో కొత్తవి బిగించలేని పరిస్థితి.
గ్రామాలకు భగీరథ నీరు చేరక పాత తాగునీటి పథకాల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు కష్టతరంగా మారింది.
క్రీడాప్రాంగణాల్లో అమర్చిన పరికరాలు తుప్పు పడుతున్నా సరిదిద్దలేని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment