సగమే..!
రైతుభరోసా
● పెట్టుబడి సాయానికి రైతుల ఎదురుచూపు ● ఇప్పటివరకు కొందరి ఖాతాల్లోనే జమ ● మూడెకరాల్లోపు ఉన్నా కొందరికి అందని వైనం
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం కొందరికే అందింది. ఇప్పటివరకు మూడెకరాల్లోపు రైతులకు మాత్రమే నగదు జమ అయింది. జిల్లాలో 55శాతం మందికి భరోసా అందింది. ఇంకా 77,190మంది ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. గత నెల 27న మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద 41,300 మందికి ఆర్థికసాయం అందజేసింది. ఎంపిక చేసిన గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్నా నగదు అందింది. తర్వాత ఎకరా, రెండు, మూడు ఎకరాల్లోపు రైతులకు విడతల వారీగా నగదు జమ చేస్తోంది. కానీ ఇంకా ఎకరం, రెండు, మూడెకరాల్లోపు ఉన్న కొందరికి నగదు జమ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకు డబ్బులు పడలేదని వ్యవసాయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివిధ కారణాలతో నగదు జమ కాలేదని వారు చెబుతున్నారు. కొందరు రైతులు సేవింగ్ ఖాతాలకు బదులు పంట రుణం ఖాతా నంబరు ఇచ్చారని, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ పేర్లలో తప్పిదాలు, ఇటీవల భూములు కొనుగోలు చేసిన కొత్త రైతులు, తదితర కారణాలతో నగదు జమ కాలేదని వివరాలు పరిశీలించి రైతులకు తెలియజేస్తున్నారు. మూడెకరాలకు పైబడి భూమి ఉన్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. నాలుగో విడత ఎప్పుడు ఉంటుందోనని సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
అందని రైతులు చాలామంది
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేలు ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.6వేల చొప్పున అందిస్తోంది. గత నెల 26నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినా ఆ రోజు బ్యాంకులకు సెలవు కావడంతో 27నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. అర్హులందరికీ ఒకేసారి కాకుండా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే పెట్టుబడి సాయం జమ చేసింది. జిల్లాలో ఎకరంలోపు ఉన్న 41,300 మందికి రూ.20,16,33,640 జమ అయ్యాయి. ఈ నెల 10 నుంచి రెండు ఎకరాల ఉన్న 7,127 మంది ఖాతా ల్లో రూ.8,70,55,624 జమ చేశారు. ఈ నెల 15నుంచి మూడెకరాల్లోపు ఉన్న 69,792 మందికి రూ.43,07,04,517 జమ కావాల్సి ఉంది. ఇప్ప టివరకు మూడో విడతలో 43,604 మందికి మాత్ర మే నగదు అయ్యింది. ఇంకా మూడెకరాల్లోపు ఉన్న 26,188 మందికి సాయం అందాల్సి ఉంది. మూడు విడతల్లోనూ నగదు జమకాని రైతులు చాలామంది వ్యవసాయ అధికారుల వద్దకు పట్టాపాసుపుస్తకంతో వెళ్లి పరిశీలించుకుంటున్నారు. ఎకరా, రెండు, మూడు ఎకరాల మధ్య వారం రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ లెక్కన పది ఎకరాలు ఉన్న రైతులకు సాగు సాయం అందాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందేమోనని రైతులు చర్చించుకుంటున్నారు.
మొత్తం రైతులు 1,69,226
అందాల్సిన నగదు రూ.191,65,88,874
ఇప్పటివరకు అందిన రైతులు 92,036
ఇప్పటివరకు అందిన నగదు రూ.69,57,35,424
జిల్లాలో వివరాలు
ఎకరన్నర ఉన్నా పడలేదు..
నాకు దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఎకరం 21గుంటల వ్యవసాయ భూమి ఉంది. రెండో విడత, మూడో విడతలో కూడా రైతుభరోసా రాలేదు. వ్యవసాయ అధికారులను అడిగితే బ్యాంకు ఖాతా తప్పుగా ఉన్నట్లు ఉందని చెబుతున్నారు. బ్యాంకు వాళ్లను అడుగుతే వ్యవసాయ అధికారులనే అడుగు అంటున్నారు. అసలు రైతుభరోసా అందుతుందో లేదో.
– అరిగెల ప్రవీణ్‌కుమార్, దండేపల్లి
ఆలస్యం చేయొద్దు
ఇప్పటికే పోయిన వానాకాలం రైతుబంధు రాలేదు. యాసంగి నుంచి రైతుభరోసా అన్నారు. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు రాలేదు. ఎప్పుడు పడుతుందని అధికారులను అడుగుతే రేపు మాపు అంటున్నారు. ఆలస్యం చేయకుండా వేయాలి.
– జే.నర్సయ్య, కన్నెపల్లి
Comments
Please login to add a commentAdd a comment