విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● మండలంలో ఆకస్మిక తనిఖీలు
జన్నారం: వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బుధవారం ఆయన మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కిష్టాపూర్ కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేశారు. తరగతిగదులు, వంటశాలలు, నిత్యావసర సరుకుల నిల్వలు, పారిశుద్ధ్యం, భోజనం నాణ్యత, రిజిష్టర్లు పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాయించారు. బోర్డుపై లెక్కలు ఇచ్చి పరిష్కారం చేయించారు. ఆస్పత్రిలోని వార్డులు, రిజిష్టర్లు పరిశీలించి రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మందులు, సేవలపై వైద్యాధికారులు జి.ఉమాశ్రీ, జే.లక్ష్మిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిష్టాపూర్ గ్రామ సమీపాన ఉన్న కేజీబీవీని తనిఖీ చేశారు. ప్రత్యేక అధికారి ఎం.శ్రీవాణిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment