గిరిజనుడి ఆత్మహత్యాయత్నం
● అటవీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ ● రేంజ్ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా
జన్నారం: అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారనే నెపంతో వాటిని కూల్చివేయడమే కాకుండా అధికారులు వేధిస్తున్నారని గిరిజనుడు విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని గడ్డంగూడ గ్రామానికి చెందిన భూమిలో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని కొందరు గిరిజనులు ఉంటున్నారు. ఈనెల 18న ఉన్నతాధికారుల ఆదేశాలతో గుడిసెలను తొలగించారు. గురువారం ఉదయం అటవీ అధికారులు అక్కడికి వెళ్లి ఖాళీ చేయాలని సూచించారు. మరో వారం గడువు ఇవ్వాలని, లేదంటే ఇక్కడే చచ్చిపోతామని గిరిజనులు పేర్కొన్నారు. అధికారుల కుదరదని తెలపడంతో మనస్తాపం చెందిన రాథోడ్ తుకారాం విషగుళికలు తిన్నాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని జన్నారానికి తీసుకువచ్చారు. ఆగ్రహంతో రేంజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి భైఠాయించారు. అధికారులు వేధించడం, తిట్టడం వల్లే తుకారాం ఆత్యహత్యాయత్నం చేసినట్లు గ్రామపెద్ద బోడ శంకర్ ఆరోపించారు. పోలీసులు 108లో తుకారాంను లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై జన్నారం రేంజ్ అధికారి సుష్మారావును సంప్రదించగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో గుడిసెలను తొలగించామన్నారు. ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని, వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
గిరిజనుడి ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment