బోనస్ వచ్చేదెన్నడో..?
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు ముగిసి 40రోజులు గడుస్తోంది. అయినా సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్ సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తోంది. ఇప్పటివరకు 10శాతం మంది రైతులకే బోనస్ జమ కాగా.. 90శాతం మందికి ఎదురు చూపులు తప్పడం లేదు. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గత ఖరీఫ్ సీజన్‌లో దొడ్డురకంతోపాటు 50శాతం సన్నరకం వరి సాగు చేశారు. దిగుబడి వచ్చిన సన్న, దొడ్డురకం ధాన్యం సేకరణకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో పీఏసీఎస్, డీసీఎమ్మెస్, డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 319 కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 17న ప్రారంభించి జనవరి 12వరకు ధాన్యం సేకరించారు. 18,155మంది రైతుల నుంచి 1,02,707.800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఇందులో సన్నరకం ధాన్యం 44,344.440 మెట్రిక్ టన్నులు ఉంటుంది. దొడ్డు రకానికి సంబంధించిన మద్దతు ధర దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ అయింది. కానీ సన్నరకం ధాన్యం బోనస్ 7,517మంది రైతులకు రూ.22,17,22,200 అందాల్సి ఉంది. ఇప్పటివరకు 726మందికి రూ.2,64,55,400 జమ అయింది. ఇంకా 6,791మంది రైతులకు రూ.19,52,66,800 బోనస్ నగదు జమ కావాల్సి ఉంది. ధాన్యం విక్రయించి మూడు నెలలు కావస్తున్నా బోనస్ డబ్బులు అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఇబ్బందుల్లో రైతులు
యాసంగి సీజన్ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో చేతిలో డబ్బులు లేక రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారని, నెలలు గడుస్తున్నా బోనస్ నగదు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు సన్న ధాన్యాన్ని పొలాల వద్దనే క్వింటాల్‌కు రూ.2,600 నుంచి రూ.2,700 చెల్లించి కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 కలిపి రూ.2815 వస్తుందని, వారం రోజుల్లో నగదు జమ అవుతుందని ఆశించారు. కానీ బోనస్ నగదు అందక ఎదురు చూడాల్సి వస్తోంది.
రెండు నెలలైంది..
వానాకాలంలో మూడెకరాల్లో సన్నరకం వరి సాగు చేసిన. దిగుబడి వచ్చిన 80క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాను. మద్దతు ధర పైసలు పడ్డయి. కానీ ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ క్వింటాల్‌కు రూ.500 చొప్పున పడలేదు. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అందలేదు.
– బొలిశెట్టి సత్తయ్య, రైతు, దండేపల్లి
మూడు నెలలుగా రైతుల ఎదురుచూపులు
ఇప్పటివరకు 10శాతం మంది ఖాతాల్లోనే జమ
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
రైతుల ఆందోళన
దండేపల్లి: సన్నరకం వరి ధాన్యానికి బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని చింతపల్లి, తానిమడుగు, రెబ్బనపల్లి గ్రామాల రైతులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ సన్నరకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో చాలామంది విక్రయించారని తెలిపారు. రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ చెల్లింపుల్లో జాప్యం చేయడం సరికాదని, వెంటనే రైతులందరికీ చెల్లించాలని కోరారు.
బోనస్ వచ్చేదెన్నడో..?
Comments
Please login to add a commentAdd a comment