● 25శాతం తగ్గింపుతో ఎల్‌ఆర్‌ఎస్ అమలు ● అనధికార లేఅవుట్
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు
మున్సిపాలిటీ 39,512
పంచాయతీ 15,729
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎల్‌ఆర్‌ఎస్(లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) ప్రక్రియ వేగవంతానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. గత నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతుండగా.. ఆశించిన మేర పూర్తి కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో డీటీసీపీ అనుమతి లేకుండానే అనధికారికంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమంగా క్రయ, విక్రయాలు జరిగిన వేలాది ప్లాట్లను క్రమబద్ధీకరించాల్సి ఉంది. జిల్లాలో ఏడు మున్సిపాల్టీలు(ప్రస్తుత కార్పొరేషన్‌తో కలిపి) ఉండగా.. మందమర్రి పట్టణం ఏజెన్సీ పరిధిలో ఉంది. మున్సిపాల్టీల్లో 39వేల దరఖాస్తులు రాగా.. ఇందులో 9వేలకు పైగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇక 16మండలాల్లో 311 గ్రామ పంచాయతీల్లో 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రెండు వేలకు పైగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. మిగతా అర్జీలు పలు దశల్లో ఉన్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్లాట్ల యజమానుల నుంచి స్పందన, సరైన పత్రాలు లేకపోవడం, పట్టణ పరిధిలో సిబ్బంది కొరతతో నత్తనడకన సాగింది. తాజాగా ప్రభుత్వం మొత్తం ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించడం, వచ్చే నెల31లోపు గడవు విధించడంతో అధికారులు వేగంగా పరిష్కరించాలని చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ పథకంపై పర్యవేక్షణ చేస్తుండడంతో ఫీజు చెల్లింపులతో సర్కారుకు ఆదాయం వస్తుందనే అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 28లోపు పరిశీలనలు పూర్తి చేసేలా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు జారీ చేశారు.
అడ్డగోలుగా అనధికార వెంచర్లు
మంచిర్యాల, లక్షెట్టిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధి మండలాల్లో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. గ్రామాల్లోనూ అనధికారికంగా ప్లాట్లు అమ్ముతున్నారు. వీటిని క్రమబద్ధీకరణ చేసుకుంటేనే నిర్మాణ అనుమతులు వస్తాయి. ఈ క్రమంలో ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి ఖజానా నింపాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లోనే జీవో విడుదల చేసింది. ఈ పథకం అమలుపై కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ పరిశీలనలు జరిగినా, చాలా తక్కువ మంది మాత్రమే ఫీజులు చెల్లించారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గతేడాది నుంచే ఎల్‌ఆర్‌ఎస్ కదలిక వచ్చింది. కానీ చాలామంది ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. దీంతో సర్కారు తాజాగా వేగంగా క్రమబద్ధీకరించేందుకు మొత్తం ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ వచ్చే నెల 31వరకు గడువు విధించింది. పాత అర్జీలతోపాటు కొత్తగా దరఖాస్తులు తీసుకునే వెసులుబాటతో మరిన్ని అర్జీలు వచ్చే అవకాశం ఉంది.
రియల్టర్లకు ఊరటే..
ఈసారి ప్లాట్ల యజమానులతోపాటు రియల్టర్లకు ఊరట కలుగుతోంది. తాజా జీవో ప్రకారం 2020 ఆగస్టు 26నాటికి ఏదైనా వెంచరులో కనీసం పదిశాతం ప్లాట్లు అమ్మకాలు జరిగి, మిగిలిన పోయిన ప్లాట్లకు కూడా ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో రియల్టర్లకు ఊరట కలుగుతోంది. చాలాచోట్ల ప్లాట్లు అమ్మకుండా మిగిలి ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేయకున్నా, మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎల్‌ఆర్‌ఎస్‌తో చేసే అవకాశం ఏర్పడింది. అయితే ప్లాటు మార్కెట్ విలువ ప్రకారం లెక్కగట్టి ఆ మొత్తాన్ని భూ యజమాని నుంచి వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ ఫీజు భారీగానే ఉండే అవకాశం ఉంది.
నిషేధిత జాబితాల్లోనూ ప్లాట్లు
కొన్ని చోట్ల సాగునీటి, ప్రభుత్వ, భూముల్లోనూ ప్లాట్లు వెలిశాయి. వాటిని దరఖాస్తుల నుంచి తొలగించారు. మున్సిపాలిటీల్లో 9500, పంచాయతీల్లో 2500అర్జీలు నిషేధిత భూముల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు ప్రతీ ప్లాటును క్షేత్రస్థాయిలో పరిశీలించి, జియోట్యాగ్ చేసి, యజమాని ఫోటోతో సహా అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత పట్టణాల్లో కమిషనర్లు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు ధ్రువీకరించాకే ఫీజు చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment