వరి సాగు అధికం.. ఆలస్యం
● నీటితడులపై ఆందోళన ● ఆరుతడి ఆంతంతే... ● స్వల్పకాలిక పంటలపై సూచనలు కరువు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి మందకొడిగా ‘సాగు’తోంది. సీజన్ ఆరంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా వరినాట్లు వేయడం కనిపిస్తోంది. దీంతో కాలువల ద్వారా సాగుకు సరిపడా నీటితడులు అందుతాయో లేదోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఓ వైపు ఎండలు ముదురుతుండగా.. నాట్లు ఆలస్యంగా వేయడంతో పంట చేతికొచ్చే వరకు నీటితడులు అందుతాయా అనే సందేహాం నెలకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల బోరుబావుల్లో నీటిమట్టం అడుగంటుతోంది. గతంలో నిండుకుండలా ఉన్న గోదావరి ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పగుళ్లతో నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి నదిలో నీరు లేకుండా పోయింది. కొన్ని చోట్ల గోదావరి తీర ప్రాంత రైతులు సాగుకు వెనుకడుగు వేశారు. యాసంగి సీజన్ అక్టోబర్ చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్ నెలాఖరు వరకు పంటల సాగు పూర్తి కావాల్సి ఉంది. ఆశించిన స్థాయిలో ఆరుతడి పంటల సాగు కనిపించడం లేదు. వరిలో కలుపుతీత, ఎరువులు వేయడం వంటి పనులు చేస్తుండగా.. వానాకాలం పంట దిగుబడులు ఆలస్యమైన కొన్ని చోట్ల నాట్లు వేసుకుంటున్నారు. యాసంగిలో గతంలో 95శాతం దొడ్డు రకం, 5శాతం సన్నరకం వరి సాగుకు ప్రాధాన్యత ఇవ్వగా.. గత ఖరీఫ్ నుంచి సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుండడంతో ఈ యాసంగిలో సన్నరకం సాగు 40శాతానికి పెరిగింది. మొత్తంగా వరి 1,12,100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 1,08,878 ఎకరాల్లో సాగైంది. మరో 60ఎకరాలు మొలక దశలోనే ఉండడంతో నెలాఖరు వరకు నాట్లు పడేలా ఉన్నాయి. కడెం ప్రాజెక్టు ఆయకట్టు, గూడెం ఎత్తిపోతల కింద సుమారు 55వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. కడెం ఆయకట్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీ 30నుంచి 42వరకు 90రోజులపాటు వారాబందీ పద్ధతిలో నీరందిస్తున్నారు. సన్నరకం వరి దిగుబడికి ఎక్కువ సమయం, నీటితడులు ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో జలాశయాలతోపాటు బోరుబావుల్లో నీరు అడుగుకు చేరుతోంది.
ఆరుతడి అంతంతే..
డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలతో రెండో పంటగా పొద్దుతిరుగుడు, పెసర, మినుము, ఉలువ పంటలు వేసుకునే అవకాశం ఉండేది. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితడులతో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేసుకోవాలని, పంటమార్పిడిపై వ్యవసాయ శాఖ సూచనలు కరువయ్యాయి. వరి తర్వాత ఇతర పంటలు 10వేల ఎకరాల్లో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. కానీ 3,385 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఫిబ్రవరి వరకు వరి నాట్లు వేసుకుంటే ఏప్రిల్, మేలో దిగుబడి రానుంది. ఏప్రిల్‌లో అకాల వర్షాలు ముంచేత్తే అవకాశం ఉండడంతో పంట నష్టపోయే ప్రమాదం ఉంటుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
పంట విస్తీర్ణం(ఎకరాల్లో)
వరి 1,08,878
మొక్కజొన్న 2,884
వేరుశనగ 204
పెసలు 124
జొన్న 57
కందులు 02
నువ్వులు 21
మినుములు 09
శనగ 51
ఇతర పంటలు 33
మొత్తం 1,12,263
Comments
Please login to add a commentAdd a comment