సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రో సేవలు
● రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గ్యాస్ట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో గ్యాస్ట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు పలు రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా గ్యాస్ట్రో ఎంట్రనాలజీ సేవలు ప్రారంభించామన్నారు. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో న్యూరోసర్జరీ, యూరాలజీ, క్యాన్సర్ తదితర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లనవసరం లేదని, ఇక్కడే అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతీ మంగళ, గురువారాల్లో గ్యాస్ట్రో సంబంధిత వైద్యులు డాక్టర్ వివేక్ రాథోడ్ అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, డాక్టర్ సత్యనారాయణ, ఆర్‌ఎంవో డాక్టర్ చంపత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


