రాత్రి పది తర్వాత రోడ్లపై కనిపిస్తే తాట తీస్తాం
● మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరిక ● ఎన్‌టీఆర్ నగర్‌లో నిర్బంధ తనిఖీలు ● ఇబ్బందులుంటే డయల్ 100కు సమాచారం ఇవ్వండి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో రాత్రి పది గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనిపిస్తే తాట తీస్తామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్‌లో బుధవారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. అనుమానితుల ఆధార్‌కార్డు, సెల్‌నంబరు, ఫొటో తీసుకుని వివరాలు సేకరించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొందరి వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీసీపీ భాస్కర్ కాలనీ ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సమాచారం అందించాలని కోరారు. యువతీ, యువకులు తమ బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సూచించా రు. డ్రగ్స్, గంజాయి, పేకాట, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యర్థులపై ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అర్హత కోల్పోతారని తెలిపారు. మహిళలను వేధించడం, చిన్న చిన్న తగాదాల్లో తల దూర్చి కేసుల పాలైతే నేరస్తునిగా ముద్ర పడుతుందని చెప్పారు. ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేస్తే క్షణాల్లో పోలీసులు మీ ముందుంటారని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు పాల్గొన్నారు.


