ముడివస్త్రం వచ్చిందోచ్..
● పాఠశాల తెరిచే నాటికి యూనిఫామ్‌లు ● ఎమ్మార్సీలకు చేరిన క్లాత్
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలలు పునః ప్రారంభం నాటికే విద్యార్థులకు ఏకరూప దస్తులు(యూనిఫామ్) అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతియేటా పాఠశాలలు పునః ప్రారంభమైన కొద్ది రోజుల వరకు యూనిఫామ్ పంపిణీలో జాప్యం జరుగుతూ వస్తోంది. రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరిచే నాటికే యూనిఫామ్‌లు అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ముందుస్తుగా ప్రతిపాదనలు పంపడంతో అవసరమైన యూనిఫామ్ క్లాత్(ముడివస్త్రం) సరఫరా సాగుతోంది. మండలాల వారీగా ఎమ్మార్సీలకు పంపిణీ జరుగుతోంది. శనివారం జిల్లాలోని కొన్ని మండలాలకు చేరింది. అక్కడి నుంచి దుస్తులు కుట్టేందుకు స్వయ సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. 2025–26 విద్యాసంవత్సరం దుస్తుల డిజైన్లలో మార్పులు చేశారు. బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించనున్నారు. చొక్కాలు, లాంగ్ ప్రాక్‌లకు పట్టీలు, భుజాలపట్టీలపైన కప్స్, ప్యాచ్‌వర్క్ లేకుండా సాధారణ యూనిఫాంలను డిజైన్‌గా మార్చడంతో కుట్టుపని సులువు కానుంది.
జిల్లాలో విద్యార్థులు ఇలా..
జిల్లాలో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందించనున్నారు. 761 పాఠశాలల్లో 42,711 మంది చదువుతున్నారు. 20,021 బాలురు, 22,690 మంది బాలికలు ఉన్నారు. ముడివస్త్రం 1,86,723 మీట్లర్లు అవసరం కాగా.. 58,059 మీటర్ల వస్త్రం జిల్లాకు సరఫరా అయ్యింది. వేసవి సెలవుకు ముందే యూని ఫామ్‌కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టినట్లు డీఈవో యాదయ్య తెలిపారు.


