అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
లోకేశ్వరం: పంటలను కాపాడుకునేందుకు బోర్లు వేసినా నీరు పడక, అప్పులు తీర్చే దారిలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రాజూర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతాని నడిపి మల్లన్నకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత పదేళ్లుగా పంటలు సాగు చేసేందుకు అప్పు చేసి 30 బోర్లు వేయించాడు. బోర్లలో చుక్క నీరు రాలేదు. ఈసారి యాసంగిలో రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంటకు నీరందక కళ్ల ముందే ఎండిపోయే దశకు చేరింది. పంటను కాపాడుకునేందుకు ఈ యాసంగిలోనే రెండు బోర్లు తవ్వించినా ఫలితం లేకపోయింది. బ్యాంకు, ప్రైవేటు అప్పులు రూ.8లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది. అప్పులు తీర్చాలో తెలియక నడిపి మల్లన్న(56) చేనులోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య నర్సవ్వ, కుమారుడు మహేష్, కూతురు మానస ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని పెన్‌గంగ నుంచి ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. భోరజ్ వద్ద జైనథ్ ఎస్సై పురుషోత్తం, సిబ్బంది రాఘవేంద్ర, శివాజీ, రజినీకాంత్ తనిఖీ నిర్వహిస్తుండగా ట్రాక్టర్లలో ఉన్న ఇసుకపై ఎలాంటి కవర్ కప్పకుండా తీసుకెళ్తుండగా పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.


