వాల్వో డ్రైవర్ల పోరుబాట
● వేతనాలు పెంచాలని 12 రోజులుగా సమ్మె ● ఐకే ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
జైపూర్: వేతనాలు పెంచాలని ఐకే ఓసీపీలో పనిచేస్తున్న వాల్వో డ్రైవర్లు గత నెల 29 నుంచి పోరుబాట పట్టారు. ఇతర ఏరియాల్లో మాదిరి తమకూ అమలు చేయాలని సమ్మెకు దిగారు. 12 రోజులుగా కార్మికులు సమ్మెకు దిగడంతో ఐకే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
జైపూర్ మండలంలోని ఇందారం ఐకేఓసీపీలో వోబీ మట్టి తవ్వకం, బొగ్గు ఉత్పత్తి పనులను వరాహ కంపెనీ చేపడుతోంది. కంపెనీలో వాల్వో డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది సుమారు 500కు పైగా పనిచేస్తున్నారు. డ్రైవర్లకు రూ.19,040, మెకానిక్‌లు, హెల్పర్లకు రూ.12వేల నుంచి 18వేల వరకు, సూపర్‌వైజర్లు, సిబ్బందికి రూ.20 వేలకు పైగా చెల్లిస్తున్నారు. వేతనాలు పెంచాలని మూడేళ్లుగా కోరుతున్నా వరాహ కంపెనీ, సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వాల్వో డ్రైవర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు సుమారు 400 మంది సమ్మెలోకి దిగారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా రూ.5వేలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం...
గతంలో ఐకే ఓసీపీ నిర్ణీత గడువుకు ముందుగానే రికార్డు స్థాయిలో వందశాతంకు పైగా బొగ్గు ఉత్పత్పి సాధించింది. ప్రస్తుతం వోబీ మట్టి తవ్వకాలు చేపడుతున్న వరాహ కంపెనీ నిర్వహణ సంక్రమంగా చేపట్టకపోవడం, కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, వాల్వో వాహనాలు, డోజర్లు సరిపడా లేకపోవడం బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
వేతనాలు పెంచాలి
గోదావరిఖని ఏరియాలో చెల్లిస్తున్న విధంగా ఇక్కడి కార్మికులకు సైతం వేతనాలు పెంచాలి. మూడేళ్లుగా వేతనాలు పెంచలేదు. సింగరేణి అధికారులు చొరవ చూపి వేతనాల పెంపునకు కృషి చేయాలి.– టి.కిష్టయ్య, కాంట్రాక్టు కార్మికుడు
వాల్వో డ్రైవర్ల పోరుబాట


