● సర్కారు భూమిలో రియల్ వ్యాపారం ● అక్రమంగా నిర్మాణాలు
మందమర్రిరూరల్: మండలంలోని పలుచోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ భూమిని కలిపి అక్రమంగా వెంచర్లు చేస్తున్నారు. రిటైర్డు ఉద్యోగులు, వ్యాపారులు ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన తర్వాత తెలిసి మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. పాలచెట్టు ఏరియా సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు వెలిసాయి. పదేళ్ల క్రితం సింగరేణి ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో ఇష్టారీతిగా నిర్మాణాలు జరిగాయి.
అమ్మేశారు..
మున్సిపాల్టీలో 1/70 గిరిజన చట్టం అమలులో ఉన్నా పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూమిని అమ్మేసి లక్షల్లో సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి సమీపంలో అందుగులపేట వద్ద 364 సర్వేనంబర్‌లో ఓ వ్యాపారి వెంచర్ చేసి విక్రయించగా మందమర్రి పట్టణానికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకున్నాడని బీఎస్పీ చెన్నూర్ నియోజవవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని ఆదిల్‌పేట్ గ్రామ పంచాయతీ పరిధి ఎర్ర చెరువు అభివృద్ధి కోసం పదేళ్ల క్రితం ప్రభుత్వం కొనుగోలు చేసిన సుమారు 30 ఎకరాల భూమిని ఇంతవరకు అధికారులు గుర్తించలేదు. రికార్డులు అందుబాటులో లేవని పేర్కొనడం గమనార్హం.
కబ్జా చేస్తే ఊరుకునేది లేదు
మండలంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. 148 సర్వేనంబర్‌లో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం స్వా ధీనం చేసుకుంది. 364 సర్వేనంబర్‌లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఫాం హౌజ్ వేసారని తెలిసింది. సర్వే చేయించి ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం. సర్వేనంబర్ 195 రామకృష్ణాపూర్ రోడ్డు వెళ్లే మార్గంలోని ఎమ్మెల్యే కాలనీలో సుమారు 16 గుంటలు ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేశాం. – సతీశ్‌కుమార్, తహసీల్దార్


