రూ.765 కోట్ల అభివృద్ధి పనులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో చేపట్టిన, చేపట్టబోయే రూ.765 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన 22 శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం ఆవిష్కరించారు. రూ.256 కోట్లతో కార్మెల్ పాఠశాల నుంచి గోదావరి వరకు రాళ్లవాగుకు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన, రూ.195 కోట్లతో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 4 పనులు, మున్సిపల్ శాఖలో రూ.30 కోట్లతో పనులు, ఎన్‌పీడీసీఎల్ శాఖ పరిధిలో రూ.32 కోట్లతో 4 పనులు, పంచాయతీరాజ్ పరిధిలో దాదాపుగా రూ.17 కోట్లతో 2 పనులు, టీజీఈడబ్ల్యూఐడీసీ పరిధిలోని 31 పాఠశాలల్లో రూ.12.50 కోట్లతో పనులు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రూ.13 కోట్లతో, సింగరేణి పరిధిలో రూ.12 కోట్లతో 2 పనుల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అటవీశాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.


