అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ, మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్ రాజును అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పని చేయాలని సూచించారు. ప్రతీ ఇంటికి నిరాటంకంగా తాగునీటి సరఫరా జరగాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని తెలిపారు.


