భార్యపై గొడ్డలితో దాడి
కోటపల్లి: వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పారం గ్రామానికి చెందిన బానోత్ పున్నం అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతడి భార్య లక్ష్మికి విషయం తెలియడంతో ఇంట్లో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో బుధవారం సదరు మహిళతో పున్నం సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకున్న లక్ష్మి భర్తను తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన పున్నం పక్కనే ఉన్న గొడ్డలితో లక్ష్మిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడు రాజేశ్ అక్కడికి చేరుకుని 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.


