వ్యవసాయరంగం బలోపేతానికి కృషి
● ఎంపీ గోడం నగేశ్
ఇంద్రవెల్లి: వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని పిట్టబొంగరంలో ఏర్పాటు చేసిన మన్‌కీ బాత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని రైతులకు రేడియో ద్వారా వినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆర్థికాభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మన్‌కీ బాత్ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగంలో పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు సలహాలు, సూచనలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతీరైతు పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా పిట్టబొంగరం, దస్నాపూర్, ధర్ముగూడ, బట్టగూడ గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగు, నాయకులు మారుతి దేవ్‌పూజే, శివకుమార్ జైస్వాల్, ముండే రాజేశ్వర్, దిలీప్ మోరే, రాథోడ్ భీంరావ్, మెస్రం తుకారాం, కనక హనుమంత్‌రావ్, కోవ రాజేశ్వర్, గేడం యేశ్వంత్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.


