
సర్కారు బడిలో వేసవి శిక్షణ
● 12 రోజులు నిర్వహణ ● జిల్లాలో 108 పాఠశాలలు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా వివిధ కార్యక్రమాల్లో రాణించేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు 15 నుంచి 20 రోజులపాటు(12 వర్కింగ్ డేస్) వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో విద్యతోపాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలను నేర్పిస్తారు. జిల్లాలో ఎలాంటి శిక్షణ నిర్వహించాలనే అంశాలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే మే 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో 12,600 మంది విద్యార్థులు
జిల్లాలో 108 పాఠశాలల్లో 12,600 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, ధ్యానం, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు, సైన్స్ ప్రయోగాలు పలు అంశాలపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో వలంటీర్లు రోజుకు మూడు గంటలపాటు అంశాలపై శిక్షణ ఇస్తారు. 40 మంది విద్యార్థులకు ఒక వలంటీర్‌ను నియమిస్తారు. ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.6 వేల గౌరవ వేతనం అందిస్తారు. ఇందుకు రూ.50 లక్షల బడ్జెట్ అంచనా వేశారు. మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు అవసరమని గుర్తించి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి.