
మార్కెట్లకు దసరా జోష్..
పండుగ నేపథ్యంలో ఊపందుకున్న షాపింగ్ తగ్గిన జీఎస్టీతో పెరగనున్న కొనుగోళ్లు అన్ని దుకాణాల్లో కనిపిస్తున్న ఆఫర్లు ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరగనున్న వ్యాపారం
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం వివిధ వస్తువులపై జీఎస్టీ స్లాబులను సవరించడంతో ఈ ఏడాది బతుకమ్మ, దసరా పండుగలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరగనుంది. ముఖ్యంగా కిరాణా సరుకులు, గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గించడంతో వాటి ధరలు దిగివస్తున్నాయి. కొత్త పన్నురేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు స్లాబుల సవరణతో వస్త్ర, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఏటా బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతం కావడం, ఏటా దసరాకు సంస్థ లాభాల వాటాను కార్మికులకు ఇస్తుండడం కూడా ఈ ప్రాంతంలో వ్యాపారం పెద్దఎత్తున జరిగేందుకు దోహదపడుతుంది. ప్రజలకు అందుబాటు ధరలతో పాటు, పలు రకాల ఆఫర్లు ప్రకటించి దుకాణదారులు ఆకట్టుకుటున్నారు.
వస్త్ర వ్యాపారం ఎక్కువే..
వస్త్ర వ్యాపారులకు ఏడాది మొత్తంలో ఎక్కువగా అమ్మకాలు జరిగేది కేవలం బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలోనే. దీంతో ఇప్పటికే ప్రజలను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నారు. ఒక్కో దుకాణదారు మరో దుకాణదారుతో పోటీ పడుతూ 50 శాతం వరకు తగ్గింపు ధరకు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రతీనెల రూ.5 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరుగుతుండగా కేవలం ఒక్క దసరా సీజన్‌లోనే రూ.15 కోట్లకు పైగా జరుగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
జీఎస్టీ తగ్గింపుతో
గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గించడంతో ఒక్కో టీవీ, ఏసీల ధర రూ.2,500ల నుంచి రూ.20 వేల వరకు తగ్గాయి. ద్విచక్ర వాహనా లు, కార్లకు వాటి ధరలను బట్టి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు తగ్గాయి. ఏటా దసరాకు ఎలక్ట్రానిక్ వస్తువులు జిల్లాలో రూ.20 కోట్ల వరకు వ్యా పారం జరిగితే ఈ ఏడాది రూ.25 కోట్లకు పైగా జరి గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దసరా పండుగ వేళ దాదాపుగా రూ.60 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వస్త్ర దుకాణంలో కొనుగోలుదారుల సందడి

మార్కెట్లకు దసరా జోష్..