బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
కాసిపేట: బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి మద్దిమాడలో చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం, మృతుడి తల్లి గంగుబాయి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడలో తల్లి గంగుబాయితో కలిసి ఉండే ఆదె సాయికుమార్(20) దేవాపూర్‌లోని మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సాయికుమార్ తనకు బైక్ కొనివ్వాలని తల్లిని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహంతో తల్లిని బయటకు గెంటేసి తలుపులు పెట్టుకున్నాడు. తల్లి బయట షెడ్డులో పడుకుని బుధవారం ఉదయం తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా సాయికుమార్ దూలానికి ఉరేసుకుని కన్పించాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. గంగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


